Vijay Shankar: టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తూ అభిమానులకు షాక్ ఇచ్చాడు. జీవితంలో కొత్త అవకాశాలను అందుకోవడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ శంకర్ వెల్లడించాడు.

తమిళనాడుకు చెందిన 35 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్, 2018 నుంచి 2019 మధ్య కాలంలో టీమిండియా తరఫున 12 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. తన కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని రెండు అద్భుతమైన క్షణాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు విజయ్ శంకర్. ఒకటి.. నాగ్‌పూర్‌లో భారత్ ఆడిన చారిత్రాత్మక 500వ వన్డేలో చివరి ఓవర్ వేసి టీమిండియాను గెలిపించడం.. రెండు.. 2019 వన్డే ప్రపంచకప్‌లో తాను వేసిన తొలి బంతికే వికెట్ పడగొట్టడం!

గత డొమెస్టిక్ సీజన్‌లో త్రిపుర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విజయ్ శంకర్ రికార్డులు ఒకసారి చూస్తే.. 77 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 13 సెంచరీలతో 4,253 రన్స్ చేశాడు. అలాగే 43 వికెట్లు తీశాడు. అటు 112 లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో 2,790 రన్స్‌తో పాటు 73 వికెట్లు పడగొట్టాడు. ఇక ఓవరాల్‌గా 159 టీ20 మ్యాచ్‌లు ఆడిన విజయ్ శంకర్.. 2,583 రన్స్ చేసి, 38 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లోనూ పలు జట్లకు ఆడి ఆల్‌రౌండర్‌గా మెప్పించిన విజయ్ శంకర్.. ఇకపై మైదానంలో కనిపించడు.

Tags: