Afghanistan ODI Series: అఫ్గాన్ వన్డే సిరీస్‌కు కోహ్లీ అవుట్.. రోహిత్ శర్మ కూడా డౌటే
రోహిత్ శర్మ కూడా డౌటే
Afghanistan ODI Series: అఫ్గానిస్తాన్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు ఊహించని గట్టి ఎదురుదెబ్బ తగిలింది! రన్ మెషీన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తొడ కండరాల గాయం కారణంగా ఈ సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా విరాట్‌కు ఈ గాయమైనట్లు తెలుస్తోంది.
బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. కోహ్లీ మోకాలి కింది భాగంలో ఉండే నరానికి గాయమైంది. దీనివల్ల ఆయన తీవ్ర నొప్పితో ఇబ్బందిపడ్డాడు. ఫైనల్ తర్వాత నిర్వహించిన స్కానింగ్‌లో ఈ విషయం వెల్లడైంది. ఇక కోహ్లీ ప్లేస్‌లో యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌ను మెయిన్ టీమ్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. శ్రీలంకలో జరగబోయే ముక్కోణపు సిరీస్ కోసం రుతురాజ్‌ను ఇప్పటికే ఇండియా–ఎ జట్టుకు ఎంపిక చేశారు. సెలెక్టర్లు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయన త్వరలోనే టీమిండియాతో కలవనున్నాడు.
మరోవైపు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కూడా ఈ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. ఐపీఎల్ సమయంలో రోహిత్ కూడా తొడ కండరాల గాయంతో ఇబ్బందిపడ్డాడు. దీనిపై అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కెట్ స్పందిస్తూ.. "రోహిత్ ఫిట్‌నెస్‌ను కూడా సమీక్షించాల్సి ఉంది. వన్డే సిరీస్ ప్రారంభానికి కొన్ని రోజులే సమయం ఉండటంతో వైద్య నిబంధలన ప్రకారం వారి ఫిట్‌నెస్‌ను పరీక్షించి తుది నిర్ణయం తీసుకుంటాం" అని వెల్లడించారు. రోహిత్, కోహ్లీ గాయాల విషయంలో మేనేజ్‌మెంట్ చాలా అప్రమత్తంగా ఉందని చెప్పారు.
గతేడాది టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రోహిత్, కోహ్లీ.. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లోనే కొనసాగుతున్నారు. 2027లో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో ఆడాలని వీరు భావిస్తున్నప్పటికీ.. ఫామ్, ఫిట్‌నెస్ ఆధారంగానే వీరి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. జూన్ 13, 17, 20 తేదీల్లో వరుసగా ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా ఈ మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లాల్సి ఉంది.