Virat Kohli Match Ticket Priced: విరాట్ కోహ్లీ మ్యాచ్ టికెట్ రూ. 80,000..! ఐపీఎల్ పాస్ స్కామ్‌లో DDCA టాప్ ఆఫీసర్?

ఐపీఎల్ పాస్ స్కామ్‌లో DDCA టాప్ ఆఫీసర్?

Update: 2026-05-16 10:24 GMT

Virat Kohli Match Ticket Priced: ఐపీఎల్ మ్యాచ్‌లను స్టేడియంలో లైవ్‌గా చూడాలనుకునే క్రికెట్ అభిమానుల బలహీనతను కొందరు కేటుగాళ్లు కోట్లలో క్యాష్ చేసుకుంటున్నారు. ఉచితంగా ఇచ్చే కాంప్లిమెంటరీ పాస్‌లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న ఒక పెద్ద రాకెట్‌ను ఢిల్లీ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ కుంభకోణంలో 'ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్' (DDCA)కు చెందిన ఒక టాప్ ఆఫీసర్ లీడర్‌గా వ్యవహరిస్తున్నట్లు తేలడం ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది.

తీవ్ర ఉత్కంఠ రేకెత్తించే మ్యాచ్‌లు, మైదానంలో ఉండే స్టార్ ఆటగాళ్ల క్రేజ్‌ను బట్టి ఈ బ్లాక్ టికెట్ల ధరలను నిర్ణయిస్తారని పోలీసుల విచారణలో తెలిసింది. సాధారణంగా బ్లాక్ మార్కెట్లో ఒక్కో టికెట్ ధర రూ. 8,000 నుండి ప్రారంభమై డిమాండ్‌ను బట్టి పెరుగుతుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఆడే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్‌లకు ఉన్న విపరీతమైన క్రేజ్‌ను వాడుకుని, ఒక్కో కాంప్లిమెంటరీ పాస్‌ను ఏకంగా రూ. 80,000 వరకు విక్రయించినట్లు ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. మ్యాచ్ ప్రారంభ సమయం దగ్గర పడుతున్న కొద్దీ రేట్లను మరింత పెంచేస్తారని సమాచారం.

ఇటీవల అరుణ్ జైట్లీ స్టేడియం వెలుపల ఐపీఎల్ కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను (ముకీమ్, గుఫ్రాన్, ఎండీ ఫైసల్) ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని గట్టిగా విచారించగా.. పంకజ్ యాదవ్ అనే ఒక పెట్రోల్ పంప్ ఉద్యోగి పేరు బయటకు వచ్చింది. ఆ పంకజ్ యాదవ్‌ను లోతుగా విచారించడంతో, ఈ దందా వెనుక అసలు సూత్రధారి అయిన DDCA టాప్ ఆఫీసర్ గుట్టు రట్టయింది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు సదరు DDCA అధికారిని దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు.

ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ప్రతి మ్యాచ్‌కు హోస్ట్ అసోసియేషన్ (మ్యాచ్ నిర్వహించే స్థానిక క్రికెట్ బోర్డు)కు స్టేడియం సామర్థ్యంలో 10 నుండి 15 శాతం టికెట్లను కాంప్లిమెంటరీ పాస్‌లుగా ఐపీఎల్ ఫ్రాంచైజీలు కేటాయించాలి. ఈ లెక్కన ప్రతి ఐపీఎల్ మ్యాచ్‌కు DDCA కి దాదాపు 6,000 ఉచిత పాస్‌లు వస్తాయి. వీటిలో 4,000 పాస్‌లను బోర్డు సభ్యులకు పంపిణీ చేస్తారు. మిగిలిపోయిన దాదాపు 1,000 నుండి 1,200 పాస్‌లను సదరు DDCA అధికారి నేరుగా పెట్రోల్ పంప్ ఉద్యోగికి చేరవేసేవాడు. ఆ ఉద్యోగి తన కింద ఉన్న ఏజెంట్ల ద్వారా వాటిని బ్లాక్ మార్కెట్లోకి వదిలి, అభిమానుల నుండి వేలాది రూపాయలు వసూలు చేసేవాడని పోలీసులు గుర్తించారు. చాలా పక్కా ప్లానింగ్‌తో, ఒక సిస్టమేటిక్ నెట్‌వర్క్‌లా సాగుతున్న ఈ ఐపీఎల్ టికెట్ల దందాపై ఢిల్లీ పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. ఈ స్కామ్‌లో ఇంకా ఎంతమంది క్రికెట్ బోర్డు పెద్దల హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

Tags:    

Similar News