Virender Sehwag Fires at Hardik Pandya: ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక చేతులెత్తేసిన ముంబయి.. ఘోర ఓటమిని మూటగట్టుకుంది. పిచ్ నుంచి సహకారం లేదనుకున్నా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీసుకుంటున్న కొన్ని వింత నిర్ణయాలు ఇప్పుడు మాజీ క్రికెటర్ల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా టీమ్ ఇండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మురళీ కార్తీక్ హార్దిక్ కెప్టెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ మ్యాచ్‌లో ముంబయి జట్టు ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో శార్దూల్ ఠాకూర్‌ను మైదానంలోకి తీసుకొచ్చింది. కానీ, అతడికి ఒక్క ఓవర్ బౌలింగ్ కూడా ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై మురళీ కార్తీక్ స్పందిస్తూ.. "నాకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కావడం లేదు. శార్దూల్‌ను ఒక ఆప్షన్‌గా టీమ్‌లోకి తీసుకున్నారు.. కానీ ఆ తర్వాత అతడిని మర్చిపోయారా? లేక మరేదైనా జరిగిందా? నా ముఖంలో కూడా అదే ప్రశ్న కనిపిస్తోంది" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీనికి సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందిస్తూ.. "నాకు ఆ రెడ్ బుల్ క్యాన్ ఇవ్వు.. కార్తీక్ మీద స్ప్రే చేశాక సమాధానం వెతుకుతా" అంటూ సరదాగా ఆటపట్టించారు.

అయితే సెహ్వాగ్ ఈ విషయాన్ని సీరియస్‌గా విశ్లేషిస్తూ.. "మీరు ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఒక బౌలర్‌ను తీసుకున్నప్పుడు కచ్చితంగా అతడిని వాడుకోవాలి. శార్దూల్ వికెట్లు తీయగల బౌలర్. కనీసం ఒక్క ఓవర్ ఇచ్చి ప్రయత్నిద్దామని కూడా కెప్టెన్‌కు అనిపించకపోవడం ఆశ్చర్యకరం. దీనికి సమాధానం హార్దిక్ పాండ్యానే చెప్పాలి" అని నిలదీశారు. బౌలర్లు భారీగా పరుగులు ఇస్తున్నప్పుడు, చేతిలో ఆప్షన్ ఉన్నా వాడకపోవడమేంటని సెహ్వాగ్ ప్రశ్నించారు.ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ ఆడిన 8 మ్యాచుల్లో కేవలం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొట్టుమిట్టాడుతోంది.

Tags: