Women's Premier League (WPL) 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్ కెప్టెన్!
ముంబై ఇండియన్స్ కెప్టెన్!
Women's Premier League (WPL) 2026: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026)లో భారత దిగ్గజ క్రికెటర్, ముంబై ఇండియన్స్ సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డుల వేట కొనసాగుతోంది. మంగళవారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆమె, డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన మైలురాళ్లను అందుకున్నారు.
హాఫ్ సెంచరీల 'దశ'కం: 193 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో హర్మన్‌ప్రీత్ కేవలం 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేసి ముంబైకి అద్భుత విజయాన్ని అందించారు. ఈ క్రమంలో డబ్ల్యూపీఎల్ చరిత్రలో 10 అర్ధ సెంచరీలు సాధించిన ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా ఆమె రికార్డు సృష్టించారు. 36 ఏళ్ల వయసులోనూ హర్మన్ కేవలం 33 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేయడం విశేషం. ప్రస్తుతం 10 ఫిఫ్టీలతో ఆమె అగ్రస్థానంలో ఉండగా, నాట్ సివర్ బ్రంట్, మెగ్ లానింగ్ (తలో 9) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
వెయ్యి పరుగుల క్లబ్‌లో తొలి భారతీయురాలు: ఈ మ్యాచ్ ద్వారా హర్మన్‌ప్రీత్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. డబ్ల్యూపీఎల్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ బ్యాటర్‌గా ఆమె నిలిచారు. ఓవరాల్‌గా నాట్ సివర్ బ్రంట్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రీడాకారిణిగా రికార్డుకెక్కారు. రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో ఫోర్ బాదడం ద్వారా ఆమె ఈ మైలురాయిని చేరుకున్నారు.
తొలి కెప్టెన్‌గా రికార్డు: కేవలం బ్యాటర్‌గానే కాకుండా, లీగ్ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి కెప్టెన్‌గా కూడా హర్మన్‌ప్రీత్ చరిత్ర సృష్టించారు. మెగ్ లానింగ్ (996 పరుగులు) ఈ జాబితాలో ఆమె వెనుక ఉన్నారు. 2.50 కోట్ల భారీ ధరకు తనను రిటైన్ చేసుకున్న ముంబై ఇండియన్స్ నమ్మకాన్ని హర్మన్ నిలబెట్టుకున్నారు. కాగా, ముంబై ఇండియన్స్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోరు ఛేదన కావడం గమనార్హం.