Ahmed Shehzad’s Sensational Remark: టీ20 వరల్డ్ కప్‌లో దారుణ ప్రదర్శన చేసిన పాకిస్థాన్ ఆటగాళ్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు (PCB) కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. అంచనాలను అందుకోలేకపోయిన ప్రతి ఆటగాడికి సుమారు 50 లక్షల రూపాయల (PKR) చొప్పున భారీ జరిమానా విధించాలని బోర్డు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నిర్ణయంపై మాజీలు, విశ్లేషకుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండగా, పాక్ ఓపెనర్ అహ్మద్ షెహజాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒక టీవీ షోలో పాల్గొన్న షెహజాద్ మాట్లాడుతూ.. "ఆటగాళ్లందరి తరపున ఆ 50 లక్షల జరిమానా నేనే చెల్లిస్తాను. అల్లా తోడు.. నేను కట్టే ఆ డబ్బుతో పాక్ క్రికెట్ బాగుపడుతుందన్నా, దేశం సరైన దారిలో పడుతుందన్నా ఒక్క రూపాయి కూడా వదలకుండా అందరి జరిమానాలు నేనే కడతాను" అంటూ సవాల్ విసిరారు. కేవలం జరిమానాలు వేయడం వల్ల క్రికెట్ మెరుగుపడదని, అసలు లోపాలను సరిదిద్దకుండా ఇలాంటి చిన్నపిల్లల చేష్టలు చేయడం ఏంటని ఆయన బోర్డును నిలదీశారు.

ఎవరైనా కావాలని ఓడిపోయినా, టీమ్ ప్లాన్ పాటించకపోయినా శిక్షించడం అర్థముందని, కానీ ప్రతిభ లేక ఓడిపోతే జరిమానా వేయడం ఏంటని షెహజాద్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న జట్టు సామర్థ్యం అంతేనని, కేవలం ఓడిపోయినందుకు జరిమానాలు వేసుకుంటూ పోతే ప్రతి మ్యాచ్‌కూ జరిమానా కట్టాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. పాక్ క్రికెట్‌లో సమూల మార్పులు చేయకుండా ఇలాంటి జరిమానాలతో కాలక్షేపం చేయవద్దని ఆయన హితవు పలికారు.

Tags: