Land Scam: బాటసింగారంలో రూ.100 కోట్ల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కుంభకోణం – శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్‌పై క్రిమినల్ కేసు!
శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్‌పై క్రిమినల్ కేసు!
Land Scam: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. కోట్ల రూపాయల విలువైన భూములను అక్రమంగా కబ్జా చేస్తూ, రాజకీయ నాయకుల అండదండలతో నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారంలో ఓరియల్ ఎస్టేట్ సంస్థ దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. నకిలీ ప్రొసీడింగ్స్ సృష్టించి ఈ రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది.
బాటసింగారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 376లో 223 ఎకరాల్లో శ్రీమిత్ర డెవలపర్స్ భారీ వెంచర్ నిర్మాణం చేపట్టింది. అయితే, ప్రజా ప్రయోజనాల కోసం వదిలివేసిన లక్ష గజాల భూమిని శ్రీమిత్ర డెవలపర్స్ కబ్జా చేయాలని ప్రయత్నించింది. నకిలీ ఆర్డీవో ప్రొసీడింగ్స్ ద్వారా అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ రామయ్య ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
ఈ ప్రొసీడింగ్స్ నకిలీవని నిర్ధారించిన అబ్దుల్లాపూర్ మెట్ రెవెన్యూ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ రామయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్‌లో స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఒక బ్యాంకు ఉద్యోగితో సహా పలువురు పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు.