Minister Ponguleti: త్వరలో 15 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. నిరుద్యోగులకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ ప్రారంభం: మంత్రి పొంగులేటి
మంత్రి పొంగులేటి
Minister Ponguleti: రాష్ట్రంలో త్వరలో 15 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించేందుకు పీఎస్‌ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘పీఎస్‌ఆర్ యువనేస్తం’ పేరిట ఆన్‌లైన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సౌకర్యం కోసం ఇప్పటికే లక్ష మంది నమోదు చేసుకున్నారని, ఎంతమంది వచ్చినా ఏడాది పాటు శిక్షణ కొనసాగుతుందని మంత్రి తెలిపారు. దీపావళి లోపు జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగీకరించారని కూడా వివరించారు.
ఎల్‌నినో ప్రభావం కారణంగా మంత్రి తన పుట్టినరోజు వేడుకలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించుకున్నారు. బుధవారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి మర్యాదపూర్వకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆర్‌సీ ఎగ్జామ్స్ సంస్థ సహకారంతో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ “నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా చూస్తున్నాం. 2016లో ఖమ్మంలో 2,300 మందికి ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వగా 462 మంది ఉద్యోగాలు సాధించారు. అదే స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. వ్యక్తిగతంగా శిక్షణ తీసుకుంటే రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. పుస్తకాలు, సామగ్రికి మరో రూ.14 వేల నుంచి రూ.30 వేలు అవసరం. ఈ భారం మోయలేని వారికోసం ఉచితంగా శిక్షణతోపాటు పుస్తకాలు అందిస్తున్నాం” అని చెప్పారు.
కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు వీరేశం, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.