Bhatti Vikramarka: తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం సమష్టిగా పోరాడుతోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహిస్తూ ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో వర్షపాతం లోటు తీవ్రంగా ఉందని, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గి జలవనరుల నిర్వహణ క్లిష్టంగా మారిందని ఆయన వివరించారు. ఇప్పటికే కేంద్రానికి కరవు నివేదిక పంపించామని, అవసరమైతే అఖిలపక్ష ప్రతినిధుల బృందంతో దిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి సాయం కోరుతామని చెప్పారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని, పశువులకు నీరు, మేత అందించేందుకు బడ్జెట్‌ సహా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. శాస్త్రవేత్తలు, నిపుణుల సూచనల మేరకు నిర్ణయాలు తీసుకుంటామని, వనరులను సమర్థంగా వినియోగించే ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.

విపత్తు సమయంలో రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వకుండా అన్ని పార్టీలు సహకరించాలని భట్టి కోరారు. గతంలో కరోనా సంక్షోభంలో లాగా ఇప్పుడు కూడా అందరూ కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నేతలు సూచించిన అంశాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, అంతర్రాష్ట్ర నదీజలాల అంశాల్లో తెలంగాణ, రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అఖిలపక్ష సలహాలను పరిగణనలోకి తీసుకొని కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి ఏడున్నర వరకు నాలుగున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, సీఎస్‌ సంజయ్‌జాజు, ఎల్‌నినో నోడల్‌ అధికారి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌, భారాస, భాజపా, మజ్లిస్‌, సీపీఐ, సీపీఐ(ఎం), తెలంగాణ జనసమితి, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, బీఎస్పీ, ఆప్‌, తెదేపా తదితర పార్టీల నాయకులు హాజరయ్యారు.

Tags: