Free bus rides for women : ఆర్టీసీ బస్సులో 200 కోట్ల మహిళల ఉచిత ప్రయాణాలు
ఆర్టీసీ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీయం భట్టి విక్రమార్క;
- మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు రూ. 6,680 కోట్లు ఆదా చేసుకున్నారు
- ఉచిత ప్రయాణాలతో ఆర్టీసీలో ఆక్యుఫెన్సీ రేషియో 97 శాతానికి చేరింది
- కాలుష్యాన్ని నివారించేందుకు హైదరాబాదులో బ్యాటరీ బస్సులు వినియోగిస్తున్నాం
- త్వరలో హైదరాబాద్ నగర మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేస్తాం
- 20 వేల కోట్లతో రాష్ట్రంలో కొత్త రోడ్లు నిర్మాణం, మరమ్మతులకు శ్రీకారం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని, ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి 6,680 కోట్లు ఆదా చేసుకున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. 200 కోట్ల మహిళల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో పండుగ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని డిప్యూటీ సీఎం అన్నారు. రాష్ట్రంలోని మహిళలు పిల్లల చదువుల కోసం, దేవాలయాల సందర్శన, నగరాల్లో ఉద్యోగం వంటి పనుల కోసం ఆర్టీసీ సేవలను మహాలక్ష్మి పథకం ద్వారా ఉపయోగించుకొని ఆర్థికంగా ప్రయోజనం పొందాలని డిప్యూటీ సీఎం తెలిపారు.
ఆర్టీసీ మునిగిపోయే పడవ అని ఆరోజు అన్నారు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు ఆర్టీసీ లాభాల్లోకి వచ్చి నిలదొక్కుకుందని డిప్యూటీ సీఎం వివరించారు. 200 కోట్ల ప్రయాణాలకు అయిన ఖర్చు 6,680 కోట్లు ఆడబిడ్డల పక్షాన ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని తెలిపారు. భవిష్యత్తులోనూ ఆడబిడ్డల ఆర్టీసీ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లిస్తుందని అన్నారు. ఆర్టీసీ లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కొత్త కొత్త విధానాలు తీసుకురావడం మూలంగా ఆదాయం పెరిగి ఇప్పటివరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2,400 కొత్త బస్సులు కొనుగోలు చేసిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఒకప్పుడు ఆర్టీసీ ఆక్యుపెన్సి రేషియో 60 శాతంగా ఉంటే మహాలక్ష్మి పథకం ద్వారా అది 97 శాతానికి పెరిగిందని తెలిపారు. మహాలక్ష్మి పథకానికి ముందు ఆర్టీసీలో 45 లక్షల మంది ప్రయాణం చేస్తే ఇప్పుడు వారి సంఖ్య 65 లక్షలకు చేరుకుందని వివరించారు.
హైదరాబాదు నగరంలో కాలుష్యం పెరుగుతోందని, ఈ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగరంలో ఉన్న డీజిల్ బస్సులను హైదరాబాద్ నగరం బయటికి దశలవారీగా ఆర్టీసీ తరలిస్తోంది. నగరంలో ఉన్న బస్సుల్లో 11 శాతం బ్యాటరీ బస్సులను జత చేశారు. ఇప్పటికే మూడు వేల బ్యాటరీ బస్సులను ఆర్డర్ ఇచ్చారు మరో 500 బస్సులను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు అని డిప్యూటీ సీయం తెలిపారు. ఈ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపారు.
మహిళలకు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణమే కాదు వారికి వడ్డీ లేని రుణాల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి, ఆ బస్సులను ఆర్టీసీకి లీజుకు ఇప్పించి మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇటీవలే బస్సుల అద్దెలకు సంబంధించిన కోటి రూపాయల నగదును నా ద్వారా మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించారని వివరించారు. ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అందిస్తున్నామని అందులో భాగంగా మొదటి సంవత్సరం లక్ష్యానికి మించి 21, 650 వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అందించామని వివరించారు. ఈనెల 12 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా శక్తి సంబరాల్లో వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు. కొద్ది రోజుల్లోనే హైదరాబాదు నగరంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ పండుగను హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మైలాసిస్టెంట్ క్షమ శాఖ మంత్రి సీతక్కల ఆధ్వర్యంలో చేస్తామని తెలిపారు.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 20వేల కోట్లతో కొత్త రహదారుల నిర్మాణం, ఉన్న రహదారుల మరమ్మతు, విస్తరణ కార్యక్రమాలు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టబోతున్నట్లు తెలిపారు. రోడ్ల నిర్మాణం ద్వారా ఆర్టీసీలో సురక్షితంగా ప్రయాణం తోపాటు రాష్ట్రవ్యాప్తంగా సుఖమైన రవాణాకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.