Mahesh Kumar Goud: తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ గురువారం సమావేశమయ్యారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, పదవుల నియామకాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్ 22ఏ భూముల విషయంలో స్పష్టంగా స్పందించారు.

“22ఏ పాపం కాంగ్రెస్ పార్టీది కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే భూ దోపిడీ చేసింది” అని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమాలు చేసి సర్వస్వం కోల్పోయిన వారు ఒకవైపు ఉండగా, కేసీఆర్ కుటుంబం మాత్రం భూములను కొల్లగొట్టిందని విమర్శించారు. భూ దోపిడీపై విచారణ జరుగుతుందని తెలిపిన ఆయన, జ్యుడీషియల్ విచారణ జరపాలా లేదా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయిస్తారన్నారు. గత ప్రభుత్వ భూ దోపిడీపై సీఎం విచారణకు ఆదేశించడం అభినందనీయమని పేర్కొన్నారు.

పార్టీ సంస్థాగత అంశాలపై మాట్లాడుతూ.. “నా పదవికి ఇంకా ఏడాది సమయం ఉంది. మంత్రివర్గ విస్తరణ జరపాలా వద్దా అన్నది సీఎం నిర్ణయం. రెండేళ్లలో సంస్థాగతంగా సాధించిన విజయాలను అధిష్ఠానం పెద్దలకు వివరించేందుకే ఢిల్లీకి వచ్చాను. గాంధీభవన్ నుంచి పార్టీ నిర్మాణం వరకు బలోపేతం చేశాం” అని చెప్పారు.

పెండింగ్‌లో ఉన్న డీసీసీ అధ్యక్షులు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియామకాలపై చర్చిస్తామని, వీలైనంత త్వరగా డీసీసీ అధ్యక్షులను నియమిస్తామని, వివిధ కార్పొరేషన్ల పదవుల భర్తీపై కూడా చర్చిస్తామని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను కూడా అధిష్ఠానానికి వివరించనున్నట్లు తెలిపారు.

Tags: