Telangana Liberation Day: సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ పాల్గొన్నారు. భారత్‌లో హైదరాబాద్‌ అంతర్భాగం కావడానికి ఎంతోమంది మహనీయుల బలిదానం కారణమని ఆయన అన్నారు.

ముందుగా పోలీసు అమరవీరుల స్మృతి స్తూపం వద్ద ఉపరాష్ట్రపతి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ విగ్రహానికి కూడా నివాళులర్పించారు. సాయుధ బలగాల నుంచి గౌరవవందనం స్వీకరించారు.

హైదరాబాద్‌ విముక్తి కోసం పోరాడిన యోధులకు నివాళులర్పిస్తున్నట్లు చెప్పిన ఉపరాష్ట్రపతి, మహనీయుల పోరాటాలు కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్‌ షెకావత్‌, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ కళారూపాలు, వేయిస్తంభాల గుడి, బతుకమ్మ శకటాలను ప్రదర్శించారు.

హైదరాబాద్‌-జోధ్‌పుర్‌కు మధ్య విడదీయరాని బంధముందని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అన్నారు. తాను జోధ్‌పుర్‌ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చానని, నిజాం కు వ్యతిరేకంగా అనేకమంది యోధులు పోరాటం చేశారని ఆయన గుర్తుచేశారు. స్వాతంత్ర్యం, స్వేచ్ఛ కోసం పోరాడి తెలంగాణను భారత్‌లో కలిపేందుకు కృషి చేశారన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి నిజాంను పొగడటం సిగ్గుచేటు అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. నిజాంలు అంత మంచివారైతే చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, మల్లు స్వరాజ్యం, రావి నారాయణరెడ్డి వారిపై ఎందుకు పోరాటం చేశారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. నిజాం పాలన పోయినా నిజాం వారసత్వమైన మజ్లీస్ పార్టీ ఇంకా అరాచకాలు సృష్టిస్తోందన్నారు. 1980 నుంచి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసిందని, గత ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నామని, 2029లో గ్రామగ్రామాన ఈ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు.

Tags: