Aarogyasri Services: నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత
ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత
Aarogyasri Services: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను మంగళవారం (సెప్టెంబర్ 16, 2025) అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఏఎన్‌హెచ్‌ఏ) ప్రకటించింది. ఈ విషయాన్ని టీఏఎన్‌హెచ్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆరోగ్యశ్రీ పథకం కింద అనుసంధానమైన 323 ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి సుమారు రూ.1,400 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆసుపత్రులు పేర్కొన్నాయి. ఈ బకాయిల సమస్యను పరిష్కరించాలని ఆరోగ్యశాఖ మంత్రి, ఆరోగ్యశ్రీ సీఈవోలను కలిసినప్పటికీ, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సేవలను నిలిపివేయాల్సి వస్తోందని డాక్టర్ రాకేశ్ వెల్లడించారు.
ప్రభుత్వం తరపున వైద్య వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల జరిగిన చర్చల్లో రూ.140 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం రూ.100 కోట్లు విడుదల చేసినట్లు, మిగిలిన రూ.40 కోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయినప్పటికీ, బకాయిల మొత్తం చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఆసుపత్రులు ఈ నిర్ణయం తీసుకున్నాయి.