Assembly Takes Key Decision: అసెంబ్లీలో కీలక నిర్ణయం – సీఎంపై కేటీఆర్‌ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు

సీఎంపై కేటీఆర్‌ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు

Update: 2026-03-19 11:01 GMT

అనర్హత పిటిషన్లపై చర్చ సాధ్యం కాదని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టీకరణ

Assembly Takes Key Decision: గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడిన సందర్భంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఉపయోగించిన పదాలు అన్‌పార్లమెంటరీగా ఉన్నందున వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు.

ఈ విషయంపై శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘‘సీఎంపై కేటీఆర్ ఉపయోగించిన అన్‌పార్లమెంటరీ పదాలను కచ్చితంగా రికార్డుల నుంచి తొలగించాల్సిన అవసరముంది. సభ బయట కూడా మీరు అడ్డగోలుగా మాట్లాడారు. అవన్నీ ప్రస్తావించడానికి ఈ సభ లేదు’’ అని అన్నారు.

విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివిన కేటీఆర్ సీఎంను ఉద్దేశించి వాడిన పదాలు అన్‌పార్లమెంటరీగా ఉన్నాయి. కడుపు మంటతో మాట్లాడిన ఆ మాటలను రికార్డుల నుంచి తొలగించాలి’’ అని కోరారు.

అయితే కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘అన్‌పార్లమెంటరీగా నేనేం మాట్లాడలేదు. రికార్డుల నుంచి తొలగించాల్సిన అవసరం లేదు. సీఎం అనని మాటలు నేనేమైనా అన్నానా..?’’ అని ప్రశ్నించారు.

అనర్హత పిటిషన్లపై చర్చ సాధ్యం కాదు

మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘‘పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వచ్చిన పిటిషన్లపై నిర్ణయం, చర్చ అంశం సభ పరిధిలోకి రాదు. సభాపతి ఛైర్మన్‌గా ఉండే ట్రైబ్యునల్‌కే దీనిపై విచారణ అధికారం ఉంటుంది. అన్ని సాక్ష్యాలను పరిశీలించి సభాపతి తీర్పు ఇచ్చారు. దీనిపై శాసనసభలో చర్చ చేపట్టడం సాధ్యం కాదు’’ అని స్పష్టం చేశారు.

కేటీఆర్ స్పందనగా.. ‘‘హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులపై కూడా ఇదే సభలో ఎన్నోసార్లు చర్చించాం. పార్టీ మారినవారిపై వేటు వేయాలని రాహుల్‌గాంధీ ‘న్యాయపత్ర’లో చెప్పిన మాటలనే నేను ప్రస్తావించా’’ అని అన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ సభ్యుల అభ్యంతరంతో కొద్దిసేపు వాగ్వాదం తలెత్తింది.

Tags:    

Similar News