ACB Raids: ఏసీబీ దాడులు: రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ కిషన్‌ అరెస్ట్‌

రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ కిషన్‌ అరెస్ట్‌

Update: 2025-12-24 05:26 GMT

ఆదాయానికి మించి రూ.12.72 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తింపు

మార్కెట్‌ విలువ వందల కోట్లు ఉంటుందని అంచనా

ACB Raids: తెలంగాణ రవాణాశాఖలో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది. మహబూబ్‌నగర్‌ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ (డీటీసీ) మూడ్‌ కిషన్‌ను అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. ఆయన నివాసంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించిన ఏసీబీ.. నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం రూ.12.72 కోట్లకుగాను, ఓపెన్‌ మార్కెట్‌లో వీటి విలువ వందల కోట్లకు చేరుకుంటుందని అధికారుల అంచనా. తెలంగాణ ఏసీబీ చరిత్రలో ఇంత భారీ అక్రమ ఆస్తులు బయటపడడం ఇదే మొదటిసారి.

మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌ ఓల్డ్‌ బోయిన్‌పల్లి రాజరాజేశ్వరి నగర్‌లోని కిషన్‌ ఇంటి వద్ద ఏసీబీ హైదరాబాద్‌ రేంజ్‌-2 డీఎస్పీ శ్రీధర్‌ నేతృత్వంలోని బృందాలు దాడులు ప్రారంభించాయి. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లోని ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. సోదాల్లో నాటకీయ పరిణామాలు వెలుగుచూశాయి. కిషన్‌ సెల్‌ఫోన్‌లో లభ్యమైన సమాచారం ఆధారంగా పాట్‌ మార్కెట్‌లోని ఓ దుకాణం నుంచి కిలోల కొద్దీ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బంధువు ఇంట్లో దాచిన ఆస్తుల పత్రాలనూ తెప్పించారు.

1994లో అసిస్టెంట్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా రవాణాశాఖలో చేరిన కిషన్‌.. బోధన్‌, నిజామాబాద్‌లో మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా, మేడ్చల్‌, మెహిదీపట్నం ఆర్‌టీవోగా పనిచేశారు. ఏడాది క్రితమే మహబూబ్‌నగర్‌ డీటీసీగా పదోన్నతి పొందారు. తొలినాళ్ల నుంచే అక్రమార్జన ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన.. నిజామాబాద్‌లోనే ఎక్కువ ఆస్తులు కూడబెట్టినట్లు సోదాల్లో తేలింది.

ఏసీబీ గుర్తించిన ఆస్తుల వివరాలు:

నిజామాబాద్‌లో ప్రముఖ లగ్జరీ హోటల్‌లో 50 శాతం షేర్‌

నిజామాబాద్‌లో 3 వేల చదరపు గజాల ఫర్నిచర్‌ షాప్‌ స్థలం

అశోకా టౌన్‌షిప్‌లో రెండు ఫ్లాట్లు

సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 31 ఎకరాల వ్యవసాయ భూమి, 4 వేల చదరపు అడుగుల పాలీహౌస్‌

నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో 10 ఎకరాల వాణిజ్య భూమి

రూ.1.37 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్‌

కిలోల కొద్దీ బంగారు నగలు

హోండా సిటీ, ఇన్నోవా క్రిస్టా కార్లు

సోదాలు పూర్తయిన అనంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిషన్‌ను అరెస్టు చేసి జ్యుడిషియల్‌ రిమాండ్‌కు పంపించారు.

Tags:    

Similar News