BJP’s Municipal Election Manifesto: భాజపా మున్సిపల్ ఎన్నికల సంకల్ప పత్రం: "మమ్మల్ని గెలిపిస్తే పన్నుల పెంపు ఉండదు.. అవినీతి రహిత అభివృద్ధి హామీ"
"మమ్మల్ని గెలిపిస్తే పన్నుల పెంపు ఉండదు.. అవినీతి రహిత అభివృద్ధి హామీ"
BJP’s Municipal Election Manifesto: మున్సిపల్ ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే అర్బన్ ప్రాంతాలను అన్ని విధాలా తీర్చిదిద్ది, అవినీతి రహిత పాలన అందిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 'వికసిత తెలంగాణ భాజపా సంకల్ప పత్రం' పేరుతో మున్సిపల్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ అధికారంలోకి వస్తే పెండింగ్‌లో ఉన్న పన్నులకు వెసులుబాటు కల్పిస్తామని, ఫైనాన్స్ కమిషన్ నిధులను పారదర్శకంగా ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు.
"మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇంటి పన్ను సహా ఎలాంటి పన్నుల పెంపు ఉండదు. యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తాం. ఆన్‌లైన్ సింగిల్ విండో విధానంతో వారం రోజుల్లో ఇంటి నిర్మాణ అనుమతులు ఇస్తాం. దోమలు, కోతులు, కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు అండర్‌పాస్‌లు, వంతెనలు నిర్మిస్తాం. ప్రధాన జన ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరలకు మందులు అందుబాటులో ఉంచుతాం. పార్కులను పచ్చదనంతో వెల్లివిరిసేలా అభివృద్ధి చేస్తాం. పాలనలో ప్రజల భాగస్వామ్యం కోసం సూచనలు సేకరిస్తాం" అని రామచందర్‌రావు వివరించారు.
భాజపా కార్యకర్తలపై కాంగ్రెస్ వారు కొన్ని చోట్ల దాడులు చేసి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారని, పోలీసులు తప్పుడు కేసులు పెడితే ఊరుకోబోమని, కేంద్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి భాజపాకు రాష్ట్రానికి ఏమిచ్చిందని ప్రశ్నిస్తున్నారని, త్వరలో భాజపా ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలతో పుస్తకం విడుదల చేస్తామని చెప్పారు. భారాస, కాంగ్రెస్‌లు అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేయలేదని, భాజపాకు ఒక్క అవకాశం ఇస్తే కేంద్ర నిధులతో తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ, "రేవంత్‌రెడ్డి, కేసీఆర్ ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. గతంలో ఓటుకు నోటు కేసులో కేసీఆర్ రేవంత్‌ను తప్పించారు. ఇప్పుడు కాళేశ్వరంలో రూ.1.30 లక్షల కోట్ల అవినీతి జరిగినా కేవలం డ్యామ్ సేఫ్టీ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ కోరి భాజపాను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు" అని ఆరోపించారు.
మరోవైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లో భాజపా తరఫున మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.