CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవనం వేగవంతం చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో రెండో దశ పనులు వేగంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్‌డీ బోధి పెవిలియన్‌లో ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
నాగోల్ నుంచి గౌరెల్లి గ్రామం వరకు ఎక్కువ శాతం వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు ఉన్నందున ఆ ప్రాంతంలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయవచ్చని సీఎం సూచించారు. జిల్లా కలెక్టర్లు సంబంధిత అధికారులతో సర్వే చేయించి ప్రాజెక్టుకు అవసరమైన భూమిని గుర్తించాలన్నారు. హెచ్‌ఎండీఏ అనుసరిస్తున్న విధానం ప్రకారం భూసమీకరణ చేపట్టాలని, చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో, అసైన్డ్ భూముల విషయంలో స్పష్టమైన విధానంతో ముందుకెళ్లాలని ఆదేశించారు. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని చెప్పారు.
మొదటి దశలో జంట జలాశయాల నుంచి బాపూ ఘాట్ వరకు 21 కి.మీ. పొడవునా నదికి ఇరువైపులా టీడీఆర్ సర్టిఫికెట్లతో భూసేకరణ చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో టీడీఆర్‌కు మంచి ధర ఉన్నందున ప్రజలకు అవగాహన కల్పించి భూసేకరణకు ఒప్పించాలన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఎంఆర్‌డీసీఎల్ ఎండీ నర్సింహారెడ్డి, జీహెచ్‌ఎంసీ, సీఎంసీ కమిషనర్లను ఆదేశించారు. టీడీఆర్ బాండ్ల జారీపై ప్రతి వారం సమీక్షించాలని, అభివృద్ధి పనులకు తక్కువ వడ్డీకి లభించే బ్యాంకు రుణాలపై దృష్టి పెట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. కొత్వాల్‌గూడ ఎకో పార్కుకు ప్రాచుర్యం కల్పించాలని హెచ్‌ఎండీఏను ఆదేశించారు.
గండిపేట జలాశయం వద్ద మంచిరేవుల వీరభద్రస్వామి గుట్టపై ఓంకారేశ్వర ఆలయ నిర్మాణంపైనా సమీక్ష జరిగింది. మాస్టర్ ప్లాన్ దాదాపు సిద్ధమైందని, మరో పది రోజుల్లో టెండర్లు పిలుస్తామని అధికారులు తెలిపారు. ఆలయ నిర్మాణంతోపాటు గండిపేట గ్రామం, ఓఆర్‌ఆర్‌తో అనుసంధానించే రహదారిని 100 అడుగులకు విస్తరించడం, మూసీ నదిలో ద్వీపాన్ని అభివృద్ధి చేసి 100 అడుగుల ఎత్తయిన శివుని విగ్రహం ఏర్పాటు చేయడం వంటి పనులన్నింటికీ ఒకేసారి టెండర్ పిలుస్తామని వెల్లడించారు.
ఈ సమావేశంలో సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ నగరపాలక సంస్థల కమిషనర్లు, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.