MLC Kavita : బీసీ రాజర్వేషన్ల సాధనకు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలి
తెలంగాణ జాగృతి వ్యవస్ధాపక దినోత్సవాల్లో కవిత డిమాండ్;
కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో దొంగ దీక్షలు చెయ్యడం కాదని నిజమైన దీక్షలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హితవు పలికారు. తెలంగాణ జాగృతి వ్యవస్ధాపక దినోత్సవం సందర్భంగా బుధవారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో కవిత జాగృతి జెండాను ఆవిష్కరించారు. నేడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి రోజున తెలంగాణ జాగృతి వ్యవస్ధాపక దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం చూడకుండానే ప్రొఫెసర్ జయశంకర్ వెళ్లిపోయారని ఈ సందర్భంగా ఆయన్ను స్మరించుకున్నారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ సూచించినట్లుగానే వారు చెప్పిన బాటలో తెలంగాణ జాగృతి కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు. అలాగే జయశంకర్ సార్ ఆలోచనా విధానాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని కవిత అన్నారు. సామాజిక తెలంగాణ కోసం పాటు పడాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని వర్గాలకు సమ న్యాయం జరగాలని జయశంకర్ సార్ చెపుతూ ఉండేవారని ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ జాగృతి పనిచేస్తుందని కవిత స్పష్టం చేశారు. జాగృతిలోకి వచ్చేందుకు చాలా మంది సిద్దంగా ఉన్నారని కవిత చెప్పారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు చిత్తశుద్ది లేవని, ఈ రెండు పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని కవిత ఆరోపించారు. బీసీల రిజర్వేషన్ల సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్ష నాయకులను తీసుకు వెళ్లాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.