Telangana: తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపు కోసం రేపటి నుంచి దరఖాస్తులు
రేపటి నుంచి దరఖాస్తులు
Telangana: తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల కోసం శుక్రవారం (సెప్టెంబర్ 26, 2025) నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న లాటరీ పద్ధతిలో ఈ దుకాణాలను కేటాయిస్తారు. 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండేళ్ల కాలానికి ఎక్సైజ్ శాఖ కొత్త లైసెన్సులను జారీ చేయనుంది.
ప్రతి మద్యం దుకాణం దరఖాస్తు రుసుముగా రూ.3 లక్షలు నిర్ణయించారు. ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం శిక్షకు గురైనవారు, ప్రభుత్వానికి బకాయిలు చెల్లించని వారు ఈ దుకాణాల కేటాయింపుకు అనర్హులుగా పరిగణించబడతారు. దుకాణాల కేటాయింపులో గౌడ్ సామాజిక వర్గానికి 15%, షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) 10%, షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ) 5% రిజర్వేషన్లు కల్పించనున్నారు. రిజర్వేషన్ కోసం దరఖాస్తు చేసేవారు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించడం తప్పనిసరి.