Bandaru Dattatraya : హర్యానా గవర్నర్‌ గా వైదొలగుతున్న బండారు దత్తాత్రేయ

తెలంగాణలో మళ్ళీ క్రియాశీలం అవుతారంటున్న దత్తన్న అభిమానులు;

Update: 2025-07-15 10:14 GMT

బండారు దత్తాత్రేయ… జగమెరిగిన రాజకీయ నాయకుడు. అభిమానులు దత్తన్నగా పిలుచుకునే బండారు దత్తాత్రేయది దాదాపు ఆరు దశాబ్ధాల ప్రజా జీవితం. 1947 జూన్‌ 12వ తేదీన హైదరాబాద్‌ నగరంలో జన్మించిన దత్తాత్రేయ తన 18వ యేట అంటే 1965వ సంవత్సరంలో ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్‌ లో చేరారు. అప్పటి నుంచి ఆరవై సంవత్సరాల పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ తో అనుబంధం కొనసాగిస్తున్నారు. 1989 వరకూ దత్తాత్రేయ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ గా పనిచేశారు. ఎమర్జెన్సీ కాలంలో లోక్‌ సంఘర్ష్‌ సమితి సంయుక్త కార్యదర్శిగా ఉన్న దత్తాత్రేయను అప్పటి ప్రభుత్వం జైల్లో పెట్టింది. 1980వ సంవత్సరలో భారతీయ జనతా పార్టీలో చేరిన బండారు దత్తాత్రేయ ఆ పార్టీతో సుదీర్ఘ కాలం తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. 1980లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ కార్యదర్శిగా పనిచేసిన దత్తాత్రేయ తదనంతర కాలంలో ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

1991లో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్ధానం నుంచి భారతయ జనతా పార్టీ తరపున మొట్టమొదటి సారిగా లోక్‌ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1998, 1999ల్లో లోక్‌ సభకు జరిగిన ఎన్నికల్లో దత్తాత్రేయ వరుసగా పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1999లో నాటి అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. అదే ప్రభుత్వంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. 2004 – 2006 సంవత్సరాల మధ్య బీజేపీ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2006లో రెండో సారి దత్తాత్రేయ ఆంద్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. 2013లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడయ్యారు. 2014లో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్ధానం నుంచి నాలుగొవ సారి లోక్‌ సభకు ఎంపికైన దత్తాత్రేయ కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖకు స్వత్రంత్ర ప్రతిపత్తితో సహాయ మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘ కాలం పార్లమెంట్‌ సభ్యుడిగా పనిచేసిన దత్తాత్రేయ అనేక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. పలు పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్‌ గా కూడా వ్యవహరించారు.

2017 లో ఆయన్నుకేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించిన తరువాత ఆర్థిక శాఖ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. 2019లో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి కిషన్‌ రెడ్డిని పోటీలోకి దింపడంతో అదే సంవత్సరం జూలై మాసంలో బండారు దత్తాత్రేయను హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమించారు. రెండు సంవత్సరాల పాటు హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ గా పనిచేసిన దత్తాత్రేయను 2021 జూలై మాసంలో హర్యానా గవర్నర్‌ గా రాష్ట్రపతి నియమించారు. తాజాగా హర్యానా కు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన విద్యావేత్త, బీజేపీ నాయకుడు అషీమ్‌ ఘోష్‌ ని నియమించడంతో ఇక బండారు దత్తాత్రేయ సుదీర్ఘ రాజకీయ జీవితానికి విశ్రాంతి లభించినట్లైంది.

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలు, బీజేపీ రాజకీయాలతో తలమునకలైన బండారు దత్తాత్రేయ చాలా లేటు వయసులో అంటే 42 సంవత్సరాల వయసులో 1989లో బంధువుల అమ్మాయి వసంతను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె విజయలక్ష్మి, కుమారుడు వైష్ణవ్‌ లు ఉన్నారు. అయితే 2018లో దురదృష్ట వశాత్తు కుమారుడు వైష్ణవ్‌ గుండెపోటుతో మృతి చెందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బిఎస్సీలో పట్టభద్రుడైన దత్తాత్రేయ భారతీయ జనతాపార్టీలో ఒక సుశిక్షితుడైన సైనికుడిలా పని చేశారు. పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా ఆయన మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో భారతీయ జనతా పార్టీ విస్తరణకు విశేషంగా కృషి చేసిన వారిలో ఒక్కరిగా నిలిచిపోతారు. సుదీర్ఘ రాజకీయ జీవితంతో పాటు పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్‌గా విశేష సేవలు అందించిన దత్తాత్రేయ హర్యానా గవర్నర్‌ గా ఒకట్రెండు రోజుల్లో పదవీ విరమణ పొందనున్నారు. 78 సంవత్సరాల వయసులో ఆయన ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పి విశ్రాంతి తీసుకుంటారో లేక మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకం అవుతారో వేచి చూడాలి.

Tags:    

Similar News