BC Reservations: బీసీ రిజర్వేషన్లు: కొనసాగుతున్న ఉత్కంఠ
కొనసాగుతున్న ఉత్కంఠ
BC Reservations: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న వివాదంపై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేదు. బుధవారం ఇరువర్గాల వాదనలు విన్నా, విచారణ పూర్తి కాకపోవడంతో గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను సవాల్ చేస్తూ బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్ తదితరులు పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల షెడ్యూలును కూడా సవాల్ చేస్తూ మరికొన్ని పిటిషన్లు వచ్చాయి. మొత్తం 30కిపైగా ఇంప్లీడ్ పిటిషన్లతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్ ధర్మాసనం సుదీర్ఘంగా విచారించింది.
ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినట్లేనని అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదించగా, అది కేవలం షెడ్యూలు మాత్రమేనని పిటిషనర్లు పేర్కొన్నారు. గవర్నర్ ఆమోదం లేకుండా నోటిఫికేషన్ జారీ చేశారా అన్న విషయంపై ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కె.వివేక్‌రెడ్డి, బి.మయూర్‌రెడ్డి, జె.ప్రభాకర్ వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, అడ్వకేట్ జనరల్ వాదించారు.
ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోతో రిజర్వేషన్లు 67 శాతానికి చేరుతాయని, ఇది 2018 చట్టం మరియు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని, కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. మహారాష్ట్రలో ట్రిపుల్ టెస్ట్ లేకుండా రిజర్వేషన్లు పెంచడాన్ని కోర్టు తప్పుబట్టిందని పేర్కొన్నారు. ఏకసభ్య కమిషన్ నివేదికను బహిరంగపరచకుండా రిజర్వేషన్లు పెంచడం సరికాదని వాదించారు. ఎన్నికల సంఘం ప్రభుత్వం చెప్పినట్లు చేయకూడదని, 50 శాతం సీలింగ్ రాజ్యాంగపరమని అన్నారు.
బీసీలకు 2024 గణాంకాలు, ఎస్సీ-ఎస్టీలకు 2011 గణాంకాలు తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు ఆరోపించారు. గవర్నర్ ఆమోదం లేకుండా బిల్లు చట్టరూపం దాల్చలేదని, జీవో 9ను నిలిపివేయాలని కోరారు.
దీనికి సమాధానంగా అభిషేక్ సింఘ్వీ.. రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని రాజ్యాంగంలో ఎక్కడా లేదని వాదించారు. శాసనసభ ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించిందని, ట్రిపుల్ టెస్ట్ ప్రకారం కమిషన్ ఏర్పాటు చేసి గణాంకాలు సేకరించామని తెలిపారు. నివేదికను బహిరంగపరచాల్సిన అవసరం లేదని, ఇది ప్రభుత్వ విధాన నిర్ణయమని అన్నారు. గవర్నర్ ఆమోదం లేకపోతే తమిళనాడు కేసు ప్రకారం ఆమోదం పొందినట్లుగా భావించాలని వాదించారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తరువాత కోర్టులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉందని పేర్కొన్నారు.
కోర్టు సంధించిన ప్రశ్నలు...
గవర్నర్ గడువు ముగిసినా నిర్ణయం తీసుకోకపోతే బిల్లు ఆమోదం పొందినట్లు భావించి నోటిఫికేషన్ జారీ చేశారా?
వికాస్ కిషన్‌రావు గవాలి కేసులో ట్రిపుల్ టెస్ట్ అమలు చేయాలని, 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఎలా మించారు?
రాష్ట్రాన్ని ఒకే యూనిట్‌గా తీసుకుని 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సరైందేనా?
కమిషన్ నివేదికను బహిరంగపరచి అభ్యంతరాలు స్వీకరించాలా?
సమాధానాలు...
తమిళనాడు తీర్పు ప్రకారం ఆమోదం పొందినట్లు భావించాలి. నోటిఫై చేశామో లేదో ఏజీ చెబుతారు.
గవాలి కేసులో కమిషన్ లేదు, ఇక్కడ ఏర్పాటు చేశాం. 50 శాతం సీలింగ్ పరిస్థితుల ఆధారంగా మారవచ్చు.
రాష్ట్రవ్యాప్త సగటును పరిగణించాం, జిల్లాల వారీగా కాదు.
నివేదిక బహిరంగపరచాల్సిన అవసరం లేదు, అసెంబ్లీలో చర్చించాం.