Etala Rajendra : నేను రాక ముందు హుజూర్‌నగర్ లో బీజేపీకి క్యాడరే లేదు
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు;
మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. శత్రువుతో నేరుగా కొట్లాడతా కానీ కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోవడం నాకు చేతకాదని ఈటల చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది. నియోజకవర్గంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు శనివారం ఈటల రాజేందర్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్తలను ఉద్దేశించి ఈటల మాట్లాడుతూ మాటల తూటాలు పేట్చారు. అవమానాలు, అవహేళనలు తట్టుకుని నిలబడితేనే రాజకీయాల్లో రాణించగలమని అన్నారు. మీ ఆవేదన నాకు అర్ధమయ్యిందని, మీ రాజకీయ అవసరాలు తీర్చలేనంత నిస్సహాయత స్ధితిలో నేను లేనని కార్యకర్తలు ఉద్దేశించి ఈటల అనునయిస్తూ మాట్లాడారు. నాకు స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదని, మీదికి ఒక మాట లోపల ఒకమాట మాట్లాడనని, ఏదున్నా బాజాప్తా మాట్లాడతానని ఈ సందర్భంగా ఈటెల స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నుంచి మనకు మనంగా బయటకు రాలేదని, 2021వ సంవత్సరం నుంచి ఆ పార్టీలో ఉండి నరకం అనుభవించానని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో అవహేళనలు, అవమానాలు తప్పవని అన్నారు. పార్టీలు మోసం చేసినా ప్రజలు ఎప్పుడూ మోసం చేయరన్నారు. హుజురాబాద్ లో ఓడిపోతానని మాత్రం తాను ఊహించలేదని ఈటెల చెప్పారు. నేను పదవులే పరమావధిగా భావించేవాడిని కాదని, ఏ పార్టీకి పనిచేస్తే ఆ పార్టీకి లాయల్ గా ఉంటా, నా అనుభం వాడుకుంటే పార్టీకి ఉపయోగపడుతుందన్నారు. కొందరు సోషల్ మీడియాలో కుట్రలు చేస్తున్నారని, అబద్దపు పునాదులపై రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని పల్లె లేదు, నియోజకవర్గంలోని ప్రతి మండలంలో నా కార్యాలయం ఉంటుందని తెలిపారు. నేను రాక ముందు హుజురాబాద్ లో బీజేపీకి క్యాడరే లేదని నేను వచ్చాకే కరీంనగర్ లో బీజేపీకి 50 వేల మెజారిటీ వచ్చిందని చెప్పారు. వచ్చే స్థానిక సంస్ధల ఎన్నికల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ పరిధిలో అన్ని పంచాయితీలు, పరిషత్తుల్లో మన వాళ్ళే ఉంటారని ఈటల రాజేందర్ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. కొత్త, పాత అనే భావన లేదని, ఉన్నదాంట్లో మనోళ్ళు అందరికీ పదవులు వస్తాయన్నారు. ఎవరి దయాదాక్షిణ్యాలు మనకి అవసరం లేదని వారి గురించి ఆలోచించకండని ఈటల రాజేందర్ కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు. ఇకపై పది రోజులక ఒకసారి హుజూర్‌నగర్ వస్తానని, మీ వెంటే ఉంటా, మిమ్మల్ని గెలిపించుకుంటా అని అన్నారు. ఈటల చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బీజేపీలో హాట్ టాపిక్ గా మారాయి.