BioAsia 2026 Summit: బయో ఆసియా 2026 సదస్సు : పేదలకు చౌక ఔషధాలు అందించడమే లక్ష్యం
పేదలకు చౌక ఔషధాలు అందించడమే లక్ష్యం
BioAsia 2026 Summit: తక్కువ ఖర్చుతో ఔషధాల అభివృద్ధిని ప్రోత్సహిస్తూ, నిరుపేదలకు చౌకగా ప్రాణాధార మందులు అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఏఐ, డేటా సెంటర్లకు మౌలిక సదుపాయాలు కల్పించడంపై అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, జీవశాస్త్ర రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తున్నామని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో రెండు రోజుల పాటు జరిగిన ‘బయో ఆసియా 2026’ 23వ అంతర్జాతీయ సదస్సు బుధవారం ఘనంగా ముగిసింది. ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు ప్రసంగించారు. అంతకుముందు ‘తెలంగాణ రైజింగ్ 2047: బిల్డింగ్ ఏ వరల్డ్ క్లాస్ లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టమ్’ అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో కూడా ఆయన పాల్గొని మాట్లాడారు.
తెలంగాణకు ఐటీ, లైఫ్ సైన్సెస్ రంగాలు రెండూ ఉండటం ప్రత్యేకత అని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. హైదరాబాద్‌లోని ప్రపంచ స్థాయి పరిశోధన కేంద్రాలు, జీనోమ్ వ్యాలీ వంటి క్లస్టర్లు రాష్ట్రానికి భారీ ప్రయోజనాలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ రెండు రంగాల కలయిక ద్వారా 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగాన్ని రాష్ట్రంలో భారీగా విస్తరించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించామని స్పష్టం చేశారు.
ప్రతి పౌరుడి ఆరోగ్య ప్రొఫైల్ రూపొందించడం, రాష్ట్రస్థాయి బయోబ్యాంక్ ఏర్పాటు, గ్రామాల వరకు ఫైబర్ కనెక్టివిటీ కల్పించడం వంటి చర్యలతో డిజిటల్ హెల్త్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. దీంతో దూరప్రాంతాల ప్రజలు కూడా నగర వైద్యులను తక్షణమే సంప్రదించగలిగేలా చేస్తున్నామని వివరించారు.
తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పవర్‌హౌస్‌గా మార్చాలనేదే ప్రభుత్వ సంకల్పమని శ్రీధర్‌బాబు అన్నారు. రెండేళ్లలో (డిసెంబరు 2023 నుంచి జనవరి 2026 వరకు) రూ.73,360 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి లక్ష ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’కు శ్రీకారం చుట్టామని తెలిపారు.
2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్య సాధనలో లైఫ్ సైన్సెస్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ (2026-2030), తెలంగాణ లైఫ్ సైన్సెస్ స్కూల్, వన్ బయో ఇంక్యుబేటర్, జీనోమ్ వ్యాలీ విస్తరణ, ఫార్మా విలేజెస్ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు.
ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ భాగస్వామ్యం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల తయారీపై దృష్టి సారిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండువేలకు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో మూడో వంతు, ఎగుమతుల్లో అయిదో వంతు వాటా తెలంగాణదే అని గర్వంగా చెప్పారు.
బ్రిటన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్, యూకే తదితర దేశాల నిపుణులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలు తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేయడంలో దోహదపడతాయని మంత్రి అభిప్రాయపడ్డారు. లైఫ్ సైన్సెస్ రంగాన్ని కేవలం వ్యాపారంగా కాకుండా సామాజిక బాధ్యతగా చూస్తున్నామని, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టి రైజింగ్ తెలంగాణలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.