Komatireddy Fires Back: కోమటిరెడ్డి ఫైర్: “నాపై కోపం సొరంగంపై చూపారు.. కేసీఆర్, కేటీఆర్ క్షమాపణ చెప్పాలి”
కేసీఆర్, కేటీఆర్ క్షమాపణ చెప్పాలి”
Komatireddy Fires Back: ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తయితే తన రాజకీయ లక్ష్యం నెరవేరినట్లేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే కేసీఆర్ మోసం వల్ల ఆ కోరిక ఇంకా నెరవేరలేదని ఘాటుగా విమర్శించారు. నల్గొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఆయన, ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“2007లోనే అమెరికా నుంచి మెషీన్ తెప్పించి ఎస్‌ఎల్‌బీసీ పనులు ప్రారంభించాం. నాకు పేరు వస్తుందని కేసీఆర్ సీఎం అయ్యాక సొరంగం పనులను పక్కన పెట్టారు. అప్పుడే కొనసాగిస్తే వెయ్యి కోట్ల రూపాయలతో రెండేళ్లలో పూర్తయ్యేవి. నాపై ఉన్న కోపాన్ని సొరంగంపై చూపించారు. నేనెంత బతిమాలినా మానవత్వం లేకుండా వ్యవహరించారు. ఆ సొరంగం పూర్తయి ఉంటే ఈ కరువు కాలంలోనూ నల్గొండ ప్రాంతంలో నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు అందేవి” అని మంత్రి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమెరికా వెళ్లి కాంట్రాక్టర్‌కు 300 కోట్లు చెల్లించి మళ్లీ పనులు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. “వచ్చే రెండేళ్లలో సొరంగం పూర్తి చేసి రెండు పంటలకు నీళ్లు అందిస్తాం. 2028 జూలైలోనే సొరంగాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. సొరంగం పూర్తి చేయకపోవడానికి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు క్షమాపణలు చెప్పాలి. వారు చేసిన పాపానికి మా ప్రాంత ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. అందుకే నల్గొండ జిల్లా ప్రజలు మిమ్మల్ని శిక్షించారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడే కాదు.. తెలంగాణలోనే బీఆర్‌ఎస్ పార్టీ ఉండదు” అని కోమటిరెడ్డి హెచ్చరించారు.