Ration Card e-KYC: రేషన్‌ కార్డుల ఈ-కేవైసీ గడువు ఆగస్టు 31 వరకు పొడిగింపు.. మూడు నెలల రేషన్‌ ఒకేసారి పంపిణీ

మూడు నెలల రేషన్‌ ఒకేసారి పంపిణీ

Update: 2026-07-31 11:43 GMT

Ration Card e-KYC: రేషన్‌కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి వార్త అందించింది. ఈ-కేవైసీ పూర్తి చేయడానికి నిర్ణయించిన గడువును మరో నెల రోజులు పొడిగించింది. ఇవాళ (జూలై 31) ఆఖరి రోజు కావడంతో ఆ గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ అధికారికంగా ప్రకటించింది.

ఈ-కేవైసీ చేయకుంటే రేషన్‌ పొందలేరని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ-కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు కూడా ఆగస్టు 31 వరకు రేషన్‌ పొందవచ్చునని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రేషన్‌ కార్డు లబ్ధిదారులకు ఊరట లభించింది.

మరోవైపు ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలకు సంబంధించి మూడు నెలల రేషన్‌ను ప్రభుత్వం ఒకేసారి పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 8,43,607 ఆహార భద్రత కార్డుదారులకు ప్రభుత్వం 59,602.822 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 7,279.513 మెట్రిక్‌ టన్నుల గోధుమలు కేటాయించింది. బియ్యం ఉచితంగా, గోధుమలను కిలోకు రూ.7 చొప్పున పంపిణీ చేస్తున్నట్టు చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌ రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు సరుకులు తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారులు తమ సమీప రేషన్‌ షాపుల్లోకి వెళ్లి మూడు నెలల కేటాయింపు సరుకులను ఒకేసారి తీసుకోవచ్చు. ఈ నిర్ణయం వల్ల వర్షాలు, ఇతర కారణాలతో రేషన్‌ తీసుకోవడంలో ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Tags:    

Similar News