BJP MLA Palvai Harish Babu: సాంకేతిక విద్యపై సీఎం సమీక్ష చేయలేదు-భాజపా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు తీవ్ర విమర్శ

భాజపా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు తీవ్ర విమర్శ

Update: 2026-08-03 14:06 GMT

BJP MLA Palvai Harish Babu: మేధావులు, విద్యార్థులను సీఎం రేవంత్‌ రెడ్డి అవమానిస్తున్నారని భాజపా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు తీవ్రంగా విమర్శించారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘సీఎం ఎందుకు నోరు పారేసుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విషయంలో ఉన్న కోపం ఇంజినీరింగ్‌ విద్యార్థులపై చూపినట్లు అనిపిస్తోంది. వైఎస్‌ హయాంలో ఇబ్బడిముబ్బడిగా ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతి ఇచ్చింది నిజం కాదా?’’ అని హరీశ్‌బాబు ప్రశ్నించారు.

సాంకేతిక విద్యపై సీఎం ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని ఆయన ఆరోపించారు. విద్యా శాఖ, పురపాలక శాఖలను తన వద్దే పెట్టుకుని సీఎం విఫలమయ్యారని విమర్శించారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులపై సీఎం చేసిన వ్యాఖ్యలు అనుచితమని, వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల సమస్యను పరిష్కరించకుండా విద్యార్థులపై కోపం చూపడం సరికాదని హరీశ్‌బాబు అన్నారు. సాంకేతిక విద్య అభివృద్ధికి సీఎం ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

Tags:    

Similar News