Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సెషన్‌ ముగిసే వరకు బీఆర్‌ఎస్‌ సభ్యులను సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ప్రకటించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు సిఫారసు మేరకు కేటీఆర్‌, హరీశ్‌రావు, కౌశిక్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, మాణిక్‌రావు, చింతా ప్రభాకర్‌, ప్రశాంత్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్‌, విజయుడు, జగదీశ్‌రెడ్డి, అనిల్‌ జాదవ్‌, సుధీర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మి, సునీత లక్ష్మారెడ్డి తదితరులను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు.

మూడో రోజు సభ ప్రారంభమైన వెంటనే ‘వి వాంట్‌ జస్టిస్‌’ అంటూ బీఆర్‌ఎస్‌ సభ్యులు సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారు. దీంతో వారిని సభ నుంచి సస్పెండ్‌ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిపాదించగా, స్పీకర్‌ ఆమోదించారు. సస్పెన్షన్‌ తర్వాత స్పీకర్‌ను కలవడానికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ సభ్యులను మార్షల్స్‌ అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, సభాపతికి చేయాల్సిన అవమానాలన్నీ బీఆర్‌ఎస్‌ నేతలు చేశారని విమర్శించారు. అవమానాలు కొనసాగించే పరిస్థితిని మానుకోవాలని కోరుతున్నామని, సభాపతి సూచనలను పాటించి సభ సజావుగా నడిచేలా చూడాలని అన్నారు. వెల్‌లోకి వచ్చి అవమానాలు చేసి స్పీకర్‌పై సవాల్‌ విసురుతున్నారని, ఆత్మగౌరవానికి భంగం కలిగించే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. విభజన తీసుకురావడానికి మరో ప్రయత్నం మంచిది కాదని, దొరతనం పోకడలను భరించడానికి రాష్ట్రం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. న్యాయం కావాల్సింది బలహీనవర్గాలు, దళిత, గిరిజనులకు అని ఆయన అన్నారు.

Tags: