High Court: తెలంగాణ అసెంబ్లీ వద్ద సోమవారం జరిగిన ఘటనపై హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకోవద్దని, అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించిన ఉత్తర్వులను సవరించాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట బైఠాయించారని, ప్లకార్డులు, వ్యతిరేక రాతలతో నల్ల టీషర్టులు ధరించి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారని ఏజీ తెలిపారు. భయానక వాతావరణం కల్పించేలా వ్యవహరించారని, నిషేధాజ్ఞలు, నియమావళిని ఉల్లంఘించినందునే శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు అడ్డుకున్నారని వాదించారు. విధుల్లో ఉన్న పోలీసులు, మహిళా కానిస్టేబుళ్లను నెట్టివేసి దూషించారని, అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు. స్పీకర్ ఆదేశాల మేరకే చీఫ్ మార్షల్స్, పోలీసులు చర్యలు తీసుకున్నారని ఏజీ వెల్లడించారు. సభ సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం కూడా స్పీకర్‌కే ఉంటుందని తెలిపారు.

పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలను సవరించాలని, దురుసుగా ప్రవర్తించిన వారిపైనా చర్యలు తీసుకోవాలని ఏజీ కోరారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించారా? ఓ సీనియర్ మహిళా ఎమ్మెల్యే మెడపై చేయి వేసి నెట్టారా? అని హైకోర్టు ప్రశ్నించగా, అలా ప్రవర్తించలేదని ఏజీ సమాధానమిచ్చారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత పరిశీలిద్దామని చెప్పారు. నియమావళి విషయాలు ఘటనకు ముందే ఎమ్మెల్యేలకు తెలియజేశారా? అని కోర్టు మరో ప్రశ్న వేసింది.

బీఆర్ఎస్ తరఫు న్యాయవాది అసెంబ్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకునే అధికారం పోలీసులకు లేదని వాదించారు. చీఫ్ మార్షల్స్‌కు స్పీకర్ ఆదేశాలు జారీ చేసినట్లు ఎలాంటి ఉత్తర్వులు లేవని, నిబంధనలు ఉల్లంఘిస్తే స్పీకర్ మాత్రమే చర్యలు తీసుకుంటారని, పోలీసులు కాదని స్పష్టం చేశారు. నిన్న పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లోని అంశాలనే ప్రభుత్వం కౌంటర్‌గా దాఖలు చేసిందని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారనుకుంటే ఎమ్మెల్యేలను స్పీకర్ దగ్గరకు తీసుకెళ్లాల్సి ఉండేదని, కానీ అరెస్ట్ చేసి తెలంగాణ భవన్‌కు ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. నిన్నటి కోర్టు ఉత్తర్వుల్లో ఎలాంటి మార్పులు అవసరం లేదని వాదించారు.

ఇరువైపులా వాదనలు ముగిసిన తర్వాత హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.

Tags: