Minister Seethakka: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలదే కీచకపర్వం.. మహిళా ఎమ్మెల్యేలపై అసభ్య ప్రవర్తనపై వీడియోతో మంత్రి సీతక్క ఫైర్
మంత్రి సీతక్క ఫైర్
Minister Seethakka: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటనపై మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్ పార్టీ సొంత మహిళా ఎమ్మెల్యేల పట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ విషయంపై సంబంధిత వీడియోను మంత్రి సీతక్క విడుదల చేశారు.
మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మంత్రి సీతక్క ఇలా అన్నారు: బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవలక్ష్మీలను వెనక నుంచి ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి తోసేశారు. గంగుల కమలాకర్ మహిళా ఎమ్మెల్యేలను వెనకనుంచి నెట్టుకుంటూ ముందుకు వచ్చారు. పక్కపక్కన నిలుచున్న ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల మధ్యలోకి సుధీర్ రెడ్డి చొరబడ్డారు. ఇద్దరు మహిళా సభ్యుల మధ్యకు చొరబడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మహిళా నేతలను అతుక్కుని ఎందుకు నిలబడ్డారని నిలదీశారు.
కోవలక్ష్మి, సబితా ఇంద్రారెడ్డిపై ఆ పార్టీ ఎమ్మెల్యేలే అనుచితంగా వ్యవహరించారని మంత్రి పేర్కొన్నారు. నవీన్ రెడ్డి నెట్టుకుంటూ పోయినప్పుడు ఆ మహిళా ఎమ్మెల్యేలు ‘అయ్యో’ అని అరిచారని చెప్పారు. మహిళా ఎమ్మెల్యేలను వెనక నుంచి తోసిన గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డిల ప్రవర్తనను ‘కీచకపర్వం’గా అభివర్ణించారు.
సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల ఇలా ప్రవర్తించడం సభ్య సమాజానికి అవమానకరమని మంత్రి సీతక్క తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆమె విడుదల చేయడంతో బీఆర్‌ఎస్‌పై విమర్శలు మరింత తీవ్రమయ్యాయి.