Palamuru Irrigation Projects : రాయలసీమ ఎత్తిపోతలను రద్దు చేయండి
ఏపీ సీయం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసిన రేవంత్ రెడ్డి;
పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ సీయం ఎనుముల రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో రూ.200 కోట్ల వ్యయంతో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మానానికి సీయం రేవంత్ రెడ్డి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీయం మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులు పూర్తి చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్రానికి సహకరించమని సీయం రేవంత్ రెడ్డి ఏపీ సీయంను అభ్యర్ధించారు. ఒకనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్న మీరు ఇప్పుడు ఈ ప్రాజెక్టులను అడ్డుకోవడం సమంజసం కాదని రేవంత్ రెడ్డి హితవు పలికారు. మా ప్రాజెక్టులు పూర్తి చేసుకోనిచ్చి మమ్మల్ని బతకనివ్వమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నాలుగు టీఎంసీలు తీసుకునేదని కానీ ఇప్పుడు 9.5 టీఎంసీల నిటిని తీసుకు వెళ్లేందుకు ఎగువన ప్రాజెక్టులు కడుతున్నారని సీయం ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు 3 టీఎంసీలను గుంజుకునే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును వెంటనే రద్దు చేసి తెలంగాణ పై ఉదారత చూపమని సీయం రేవంత్‌రెడ్డి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న మీ ఆలోచనలు నిజమైతే రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేయాలని ఏపీ సీయంను రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మా విజ్ఞప్తులు వినకపోతే ఎలా పోరాటం చేయాలో పాలమూరు బిడ్డలకు తెలుసని హెచ్చరించారు. వచ్చే రెండున్నరేళ్ళ కాలంలో పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.