BJP: భాజపా నుంచి ఎమ్మెల్సీగా రామచందర్రావుకు మరో అవకాశం?
మరో అవకాశం?
BJP: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్రావును మళ్లీ బరిలోకి దించేందుకు పార్టీ సన్నాహాలు చేస్తోంది. మంగళవారం హైదరాబాద్ నగర భాజపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో త్రిసభ్య కమిటీ ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని పార్టీ నేతలతో చర్చించి అభిప్రాయాలు సేకరించింది. రామచందర్రావు అభ్యర్థిగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది.
రామచందర్రావు 2009 నుంచి ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 2015లో విజయం సాధించగా, 2009, 2021లలో ఓడిపోయారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉమ్మడి జిల్లాల నేతలతో కూడా త్రిసభ్య కమిటీ సమావేశమై మాట్లాడింది. ఇక్కడి నుంచి వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశం ఉందని సమాచారం.
ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో నలుగురు ఎంపీలు, ఒక ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు భాజపా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి (సికింద్రాబాద్), ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, డి.కె.అరుణ (మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్నగర్) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ గోషామహల్కు, ఎమ్మెల్సీలుగా ఏవీఎన్రెడ్డి, మల్క కొమరయ్య ఉండటం పార్టీకి అనుకూలంగా ఉందని భావిస్తున్నారు.
కాంగ్రెస్ ఇప్పటికే ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో భాజపా కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి కసరత్తు చేస్తోంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానం నుంచి 28 మంది, నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానం కోసం పది మంది దరఖాస్తులు ఇచ్చినట్లు తెలిసింది.
త్రిసభ్య కమిటీ ఒక్కో ఎమ్మెల్సీ స్థానం నుంచి మూడు పేర్లతో జాబితా, అభిప్రాయసేకరణ నివేదికను బుధవారం రామచందర్రావుకు అందజేయనుంది. దీనిపై రాష్ట్ర పార్టీ చర్చించి జాతీయ నాయకత్వానికి నివేదిక పంపనుంది.