Chalo Lok Bhavan: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘చలో లోక్‌భవన్‌’ కార్యక్రమం నిర్వహించారు. సర్‌ ప్రక్రియలో అవకతవకలకు నిరసనగా, ప్రజాస్వామ్యం కాపాడుకోవాలనే నినాదంతో ఈ ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌, టీజేఏస్‌, లెఫ్ట్‌ పార్టీలు పిలుపునిచ్చిన ఈ నిరసనలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రులు, ఇండియా కూటమి రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.

నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్‌భవన్‌ వైపు భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌, సీపీఐ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. ఖైరతాబాద్‌ నుంచి లోక్‌భవన్‌ వైపు ర్యాలీగా బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. లోక్‌భవన్‌కు 300 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి ఆందోళనకారులను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ర్యాలీని అడ్డుకున్న పోలీసులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌, మంత్రులు శ్రీధర్‌ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌ను అరెస్ట్‌ చేసి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి.

ఇదే సమయంలో ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి వెళ్లారు. రాహుల్‌, ప్రియాంకను కలవాలని యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ చర్యను సీఎం తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘రాహుల్‌ గాంధీ ప్రజాస్వామ్యయుతంగా చేపట్టిన ఆందోళనను అడ్డుకోవడం మోదీ, అమిత్‌ షా నిరంకుశత్వానికి నిదర్శనం. సర్‌ను తక్షణమే నిలిపివేయాలి. ప్రజల ఓటు హక్కును ఈసీ హరిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ, మైనారిటీ ఓట్లను టార్గెట్‌గా కుట్ర జరుగుతోంది. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు పోరాడతాం. ఎన్నికల్లో గెలవడానికి ఈడీ, సీబీఐని వాడేవారు. ఇప్పుడు ఈసీని ప్రయోగిస్తున్నారు’’ అని రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

ఈ విధంగా రాష్ట్రంలోనూ, జాతీయ స్థాయిలోనూ సీఈసీ రాజీనామా డిమాండ్‌తో ఇండియా కూటమి నిరసనలు కొనసాగుతున్నాయి.

Tags: