CM Revanth Reddy: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, పిల్లల భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని ఆయన చెప్పేవారని సీఎం గుర్తు చేశారు.

తల్లిదండ్రులతో సమానంగా పిల్లల భవిష్యత్తుకు పునాది వేసేది ఉపాధ్యాయులేనని, పిల్లలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేది కూడా వారేనని రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొస్తున్నామని, చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను పూర్తి చేశామని, బదిలీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. 317 జీవోతో బదిలీల సమస్యలు పరిష్కరించామని, కేకే కమిటీ ద్వారా సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్పారు. ప్రజాపాలన వచ్చిన తర్వాత 55 రోజుల్లోనే 10 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని గుర్తు చేశారు.

విద్యారంగంలో తెలంగాణ ఎన్నో విజయాలు సాధించిందని, బీఆర్ఎస్‌ పాలనలో 28వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు 17వ స్థానానికి చేరుకుందని సీఎం కొనియాడారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్‌ పెరుగుతుంటే తెలంగాణలో అడ్మిషన్లు పెరుగుతున్నాయని, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 95 శాతం సీట్లు భర్తీ అయ్యాయని వెల్లడించారు. 88 మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారని, తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని చెప్పారు. రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

ఉత్తమ ఉపాధ్యాయులను గౌరవిస్తున్నామని, ఈ రోజు 123 మంది ఉత్తమ టీచర్లను సన్మానించామని తెలిపారు. ఉపాధ్యాయులను విదేశాలకు పంపి అవగాహన కల్పించామని చెప్పారు. రెండేళ్ల సమయం ఇస్తే ఉపాధ్యాయుల సమస్యలన్నీ సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వెయ్యి రోజుల ప్రజాపాలనలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని, 2028 డిసెంబర్‌ లేదా 2029 మార్చిలో ఎన్నికలు వచ్చే వరకు సమస్యలు పరిష్కరించకపోతే ఉపాధ్యాయులే మార్కులు వేయాలని సవాలు విసిరారు. ఉపాధ్యాయులు రాజకీయ నాయకుల ట్రాప్‌లో పడవద్దని, విద్యార్థులు మోసపోవద్దని సూచించారు.

కార్యక్రమంలో సీఎం ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించి, ఉపాధ్యాయులతో గ్రూప్‌ ఫొటో దిగారు.

Tags: