TPCC Chief Mahesh Kumar Goud: మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తొలగించిన అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పందించారు. ఆమె తీరు ఆక్షేపణీయంగా ఉండటంతోనే అధిష్ఠానం చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. కొండా సురేఖ బర్తరఫ్‌ బాధాకరమని అన్నారు. అయితే ఆమె మాటతీరు మార్చుకోవాలని హితవు పలికారు.

దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడారు. ‘‘కొండా సురేఖ కాంగ్రెస్‌లో కొనసాగుతానని చెప్పారు. పార్టీలో ఉంటే తప్పకుండా అవకాశం ఇస్తాం. గురువారం కొండా సురేఖ ఆవేశం, ఆవేదనతో మాట్లాడారు. ఇకపై అలా మాట్లాడకూడదని సూచిస్తున్నా. పార్టీలో ఎవరికైనా ఇబ్బందులుంటే నేరుగా పీసీసీ అధ్యక్షుడి వద్దకు వచ్చి చెప్పుకోవచ్చు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి, అధిష్ఠానాన్ని కలవచ్చు. తమ ఆవేదన వ్యక్తం చేయొచ్చు. అంతేకానీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే కాంగ్రెస్‌ పార్టీ సహించదు. అదే సంకేతాన్ని గురువారం ఇచ్చింది’’ అని చెప్పారు.

క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే సురేఖపై చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే హైకమాండ్‌ చర్యలు తీసుకుందని వెల్లడించారు. పార్టీ లైన్‌ ఎవరు దాటినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉంటుందని.. అయితే క్రమశిక్షణ విషయంలోనూ పార్టీ అంతే కఠినంగా ఉంటుందని అన్నారు.

ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. కుమార్తె సుస్మిత వ్యాఖ్యలను సురేఖ ఖండించాల్సిందని అభిప్రాయపడ్డారు. సుస్మిత వ్యాఖ్యలను సురేఖ ఖండించకపోవడాన్ని ఏఐసీసీ తీవ్రంగా పరిగణించిందని తెలిపారు. మాట్లాడేందుకు పార్టీలో ఎన్నో వేదికలు ఉన్నాయన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డికి ఎవరినీ బ్లాక్‌మెయిల్‌ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. భవిష్యత్తులోనూ బీసీలకు పెద్దపీట వేస్తామని మహేశ్‌ గౌడ్‌ పేర్కొన్నారు.

‘‘ఏ కాంగ్రెస్‌ నాయకుడైనా హద్దులు దాటి మాట్లాడితే చర్యలు తప్పవు’’ అని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు.

Tags: