Mallannasagar Land Acquisition: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిమిత్తం జీవో 123 కింద పరస్పర అంగీకారంతో భూములను ఇచ్చిన వారికి పునరావాసం, పునర్నిర్మాణ ప్రయోజనాలను నిరాకరించరాదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. సవరణ జీవో 214 కింద ఒప్పందం ద్వారా లావాదేవీలు పూర్తయ్యాయని, పత్రాల మార్పిడి జరిగి అంగీకారపత్రాలు సమర్పించారన్న కారణంగా పునరావాస ప్రయోజనాలను తిరస్కరించరాదంటూ తీర్పు వెలువరించింది.

సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన టి.బాలామణి, మరికొందరు వేర్వేరుగా 2017లో హైకోర్టును ఆశ్రయించారు. జీవో 123 కింద భూములను తీసుకున్న ప్రభుత్వం భూసేకరణ చట్టంలోని పునరావాస, పునర్నిర్మాణ పథకం కింద ప్రయోజనాలు కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై జస్టిస్‌ వాకిటి రామకృష్ణారెడ్డి ఇటీవల విచారణ చేపట్టారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూసేకరణ నిమిత్తం జీవో 123 జారీ చేశారు. తర్వాత పునరావాస ప్రయోజనాలను విడిగా కల్పిస్తామంటూ జీవో 214 జారీ అయింది. ఈ మధ్యలో జీవో 123 కింద భూమిని సేకరించరాదంటూ ఇదే హైకోర్టు తీర్పు వెలువరించగా ప్రభుత్వం దాన్ని సవాలు చేసింది. ఇంకా అది పెండింగ్‌లో ఉండగా... ఇప్పటికే జీవో 123 కింద పిటిషనర్ల భూములను ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చేయించుకుంది. ఒప్పందంలో వారికి పునరావాసం, పునర్నిర్మాణం ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అమలు చేయడంలేదు’’ అని వివరించారు.

ప్రభుత్వ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్లు ప్రభుత్వం చెల్లించిన పరిహారానికి అంగీకరించాకే భూములను ఇచ్చారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... ‘‘పునరావాసం, పునర్నిర్మాణ ప్రయోజనాలను పొడిగించే అంశాన్ని పరిశీలించాలి. ఈ ప్రక్రియ మొత్తం ఆరు నెలల్లో పూర్తి చేయాలి. ఈ ఉత్తర్వులు కేవలం పునరావాస ప్రయోజనాలకే పరిమితం. జీవో చట్టబద్ధతపై ఈ కోర్టు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడంలేదు’’ అని పేర్కొన్నారు.

ఈ తీర్పు మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ కోసం అంగీకారంతో భూములు ఇచ్చిన రైతులు, భూస్వాములకు పునరావాస ప్రయోజనాలు అందించాలని స్పష్టం చేస్తూ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.

Tags: