Chief Minister A. Revanth Reddy: ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో డిసెంబర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు అందించనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

గురువారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో యూకే బిజినెస్ స్కూల్స్, విశ్వవిద్యాలయాల 30 మంది ప్రతినిధుల బృందంతో సమావేశమైన సందర్భంగా సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ బృందంలో యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు కరణ్ బిలిమోరియా, బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ జనక పుష్పనాథన్, చార్టర్డ్ అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ స్కూల్స్ సీఈఓ ఫ్లోరా హామిల్టన్, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

తెలంగాణను ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్’గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని సీఎం పేర్కొన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలు, బిజినెస్ స్కూల్స్ రాష్ట్రంలో క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ఎంఐటీ, పర్డ్యూ వంటి ప్రముఖ సంస్థలు హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైందని తెలిపారు.

హార్వర్డ్, ఎంఐటీ, లండన్ విశ్వవిద్యాలయం, వర్జీనియా టెక్, నార్త్‌ఈస్టర్న్ విశ్వవిద్యాలయం వంటి అంతర్జాతీయ సంస్థలతో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లు, డ్యూయల్ డిగ్రీ కోర్సులు, అధ్యాపకుల శిక్షణ, పరిశోధన రంగాల్లో భాగస్వామ్యాలు చేపట్టవచ్చని సీఎం అన్నారు. విదేశీ విద్యాసంస్థలు వస్తే స్థానిక విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలతో కలిసి పనిచేయడం, ఇక్కడే పరిశోధనలు చేపట్టడం సాధ్యమవుతుందని అన్నారు. యూకే బిజినెస్ స్కూల్స్ రాష్ట్రంలో ఏర్పాటైతే ప్రపంచ స్థాయి కార్పొరేట్ సంస్థలు తెలంగాణ వైపు దృష్టి సారిస్తాయని, విద్యార్థులు, అధ్యాపకులకు అంతర్జాతీయ అనుభవం, ప్రపంచ స్థాయి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

ఫ్యూచర్ సిటీలో ఎడ్యుకేషన్ హబ్‌ను తీర్చిదిద్దనున్నట్లు సీఎం వివరించారు. మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు అత్యాధునిక నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు ఇంగ్లీష్, జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషా నైపుణ్యాలు పెంపొందించేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

డిసెంబర్‌లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు యూకే విద్యా రంగంలోని ముఖ్యులందరినీ ఆహ్వానించారు. ఈ సమ్మిట్ దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తరహాలో ఉంటుందని, ప్రపంచ పెట్టుబడిదారులకు తెలంగాణను ప్రదర్శించే వేదికగా మారుతుందని సీఎం తెలిపారు.

Tags: