Deputy CM Bhatti Vikramarka: ఇరవై వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతో 2030 నాటికి తెలంగాణను హరిత ఇంధన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గురువారం ఖమ్మం పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఆయన మాట్లాడుతూ, 1948 సెప్టెంబరు 17న భారతదేశంలో అంతర్భాగంగా మారి ప్రజాస్వామ్య పాలనలోకి తెలంగాణ అడుగుపెట్టిందని గుర్తు చేశారు. ప్రస్తుతం వెయ్యి రోజుల ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసి ముందుకు సాగుతున్నామని, ప్రజాస్వామిక స్వేచ్ఛ కోసం ఉద్యమించిన యోధుల త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత అని అన్నారు. పేదలు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు.

సీతారామ ప్రాజెక్టులో భాగమైన పాలేరు అనుసంధాన కాలువ ద్వారా 1,38,790 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు పనులు కొనసాగుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఖమ్మం-కోదాడ నాలుగు వరుసల జాతీయ రహదారి, ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణాలతో పల్లెలు, పట్టణాలు అనుసంధానమై యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, పంట ఉత్పత్తుల రవాణా మెరుగుపడుతున్నదని తెలిపారు.

Tags: