CM Revanth: ఐకాస నేతలతో సీఎం రేవంత్ కీలక సమావేశం.. రెండు డీఏలపై సానుకూల సంకేతాలు
సానుకూల సంకేతాలు
CM Revanth: తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ/ఐకాస) నేతలు గురువారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను వేర్వేరుగా కలిశారు. సుమారు అరగంటపాటు జరిగిన చర్చలో పీఆర్‌సీ, పెండింగ్ డీఏలు, బిల్లుల క్లియరెన్స్ వంటి ప్రధాన డిమాండ్లను విన్నవించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, కొద్ది రోజుల్లోనే రెండు డీఏలు విడుదల చేసే అవకాశం ఉందని సూచించినట్లు నేతలు తెలిపారు.
ఐకాస్ ఛైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, అడిషనల్ సెక్రటరీ జనరల్ పుల్గం దామోదర్‌రెడ్డి, ఇతర నేతలు సదానందం గౌడ్, చావ రవి, గౌతమ్‌కుమార్, భిక్షం గౌడ్ తదితరులు సీఎంను కలిశారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు మరో ఐకాస్ ఛైర్మన్ వి. లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్‌లతో కూడిన బృందం కూడా సీఎం, స్పీకర్‌ను కలిసి వినతిపత్రం అందించింది.
ముఖ్య డిమాండ్లు ఇవే:
పీఆర్‌సీ నివేదికను వెంటనే తెప్పించి 51 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలి. దసరా పండుగ నాటికి పీఆర్‌సీ అమలు చేయాలి.
పెండింగ్‌లో ఉన్న ఐదు లేదా ఆరు డీఏల్లో కనీసం మూడు డీఏలను అసెంబ్లీ సమావేశాల్లోనే విడుదల చేయాలి.
ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రతి నెలా రూ.2 వేల కోట్లు విడుదల చేయాలి.
ఈహెచ్‌ఎస్ సక్రమ అమలు, ఉద్యోగ సంఘాలకు ఓడీ సౌకర్యం, సీపీఎస్ విధానం రద్దుకు నిపుణుల కమిటీ ఏర్పాటు, సంఘాల గుర్తింపు వంటి అంశాలు.
సీఎం రేవంత్‌రెడ్డి ఈ డిమాండ్లపై స్పందిస్తూ.. పీఆర్‌సీ నివేదిక అందిన తర్వాత ఆర్థిక శాఖ అధికారులతో, ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఆర్థిక పరిస్థితిని సమీక్షించి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ‘మీరు ఎప్పుడైనా నన్ను కలవొచ్చు. నా ఆఫీసు రచ్చబండ. రాత్రి సమయంలో కూడా వచ్చి మాట్లాడొచ్చు’ అని స్పష్టం చేశారు. పెండింగ్ బిల్లుల విషయంలో గత జనవరి నుంచి ఇప్పటి వరకు రూ.10 వేల కోట్లు విడుదల చేశానని తెలిపారు. ఓడీ సౌకర్యంపై కూడా సానుకూలంగా స్పందించినట్లు నేతలు చెప్పారు.
అంతకుముందు ఐకాస్ నేతలు పీఆర్‌సీ ఛైర్మన్ శివశంకర్‌ను కలిసి నివేదికను త్వరగా సమర్పించాలని కోరారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కూడా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సమావేశం తర్వాత ఐకాస్ నేతలు సీఎం సానుకూల వైఖరిపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని, త్వరిత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.