Kishan Reddy: ‘చట్టసభలు ప్రజాస్వామ్య దేవాలయాలు.. ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలి’: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సూచన
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సూచన
Kishan Reddy: చట్టసభల్లో ప్రజాప్రతినిధులు హుందాగా, గౌరవంగా వ్యవహరించాలని, తమను ఎన్నుకున్న ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో పార్టీల కంటే పార్లమెంటరీ విలువలే ప్రధానమని, ప్రజాస్వామ్యంలో పార్లమెంటే దేవాలయమని ఆయన పేర్కొన్నారు.
బుధవారం దిల్లీలో జరిగిన 2026 సంసద్ రత్న అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. ‘తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, భారాస వ్యవహార శైలి అప్రజాస్వామికంగా ఉంది. దీన్ని చూస్తే ప్రజాస్వామ్యం ఎటుపోతోందో అనిపిస్తుంది’ అని ఆయన విమర్శించారు.
ప్రభుత్వ పనితీరు నచ్చకపోతే విపక్షాలు సునిశితంగా విమర్శించాలని, ప్రశ్నించాలని, అవసరమైతే వాకౌట్ చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెబుతుండేవారని గుర్తు చేశారు. ‘నేడు ఆ పరిస్థితి లేదు. సభను గందరగోళం చేయడం పైనే విపక్షాలు దృష్టి పెడుతున్నాయి’ అని కిషన్‌రెడ్డి అన్నారు.
ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 4 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌లతో కలిపి 16 మంది ఎంపీలకు సంసద్ రత్న అవార్డులు అందజేశారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, కేంద్ర సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం, పలువురు పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.