CM Revanth Reddy: కృష్ణా జలాలపై తెలంగాణ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కృష్ణా ట్రైబ్యునల్‌ ఎదుట బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీలపైనే ప్రధానంగా దృష్టి సారించాలని, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని నీటిపారుదల శాఖ అధికారులకు స్పష్టం చేశారు.

అంతర్రాష్ట్ర జల వివాదాలు, కృష్ణా ట్రైబ్యునల్‌ వాదనలు, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులపై శుక్రవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ ప్రస్తుత పరిస్థితిని వివరించారు. 2023 అక్టోబరు 6న కేంద్రం జారీ చేసిన టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ (టీఓఆర్‌) ప్రకారం తుది వాదనలు జరుగుతున్నాయని, ఆంధ్రప్రదేశ్‌ వాదనలు ఆగస్టు 13న ముగియగా తెలంగాణ రిజాయిండర్‌ వాదనలు 14న జరిగాయని తెలిపారు. సెప్టెంబరు 16 నుంచి 18 వరకు జరిగే ట్రైబ్యునల్‌ సమావేశాల్లో తెలంగాణ తదుపరి వాదనలు వినిపించాల్సి ఉందని న్యాయవాదులు వివరించారు.

బచావత్‌ ట్రైబ్యునల్‌ 811 టీఎంసీలు కేటాయించగా, బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ 65 శాతం సగటు నీటి లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1050 టీఎంసీలు కేటాయించింది. అయితే బ్రిజేష్‌కుమార్‌ తీర్పు ఇంకా నోటిఫై కాకపోవడంతో మొదట 811 టీఎంసీల్లో తెలంగాణకు ఎక్కువ వాటా రావాలని, ప్రాజెక్టుల వారీగా కేటాయింపులపై దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలోని కరవు, ఫ్లోరైడ్‌, వెనుకబడిన ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాలను ఆధారాలతో చూపి వాదించాలని కోరారు.

వరద నీటిపై స్పష్టత ఉండాలని, కృష్ణాపై ఉన్న మూడు ప్రాజెక్టులు నిండి పైనుంచి ప్రవహించినపుడే వరద నీరని నిర్వచించాలని, వరద లేకుండానే ఆంధ్రప్రదేశ్‌ నీటిని మళ్లించడం వల్ల విద్యుదుత్పత్తిపై ప్రభావం పడుతుందని, ఆ నష్టానికి పరిహారం కోరాలని న్యాయవాద బృందానికి, ఇంజినీర్లకు సీఎం సూచించారు. 2014కు ముందు మంజూరైన ప్రాజెక్టుల వివరాలన్నీ తయారు చేయాలని ఆదేశించారు.

తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, బేసిన్‌ పరిధిని పరిగణనలోకి తీసుకొని నీటి పంపిణీ చేయాలని గట్టిగా కోరాలని, కృష్ణా ట్రైబ్యునల్‌-1, 2 కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 1050 టీఎంసీలు, పోలవరం ద్వారా తరలించే 45 టీఎంసీల్లో 71 శాతం వాటా కోరాలని, ఆంధ్రప్రదేశ్‌ బేసిన్‌ బయటి ప్రాజెక్టులకు 325 టీఎంసీలు మళ్లిస్తుందని, బేసిన్‌లోని ప్రాజెక్టులకే ఎక్కువ నీరు కేటాయించాలని, పంట నీటి అవసరాలను శాస్త్రీయంగా అంచనా వేసి ట్రైబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు.

సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌ న్యాయవాదులు గోపాల్‌ శంకర్‌ నారాయణ్‌, అడ్వొకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి, సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్‌, కార్యదర్శి శ్రీధర్‌, అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం ఇంజినీర్లు పాల్గొన్నారు.

Tags: