AIMIM MLC Mirza Rahmath Baig: ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌కు షాక్.. పార్టీ నుంచి తక్షణ బహిష్కరణ
పార్టీ నుంచి తక్షణ బహిష్కరణ
AIMIM MLC Mirza Rahmath Baig: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ తన శాసనమండలి సభ్యుడు మిర్జా రహ్మత్ బేగ్‌ను పార్టీ నుంచి తక్షణమే బహిష్కరించింది.
పార్టీ జాయింట్ సెక్రటరీ ఎస్‌ఏ హుస్సేన్ అన్వర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆయన మాటల్లో – “మిర్జా రహ్మత్ బేగ్‌ను ఎంఐఎం పార్టీ నుంచి తక్షణమే బహిష్కరించడం జరిగింది. ఆయన తన ఎమ్మెల్సీ పదవికి వెంటనే తెలంగాణ శాసనమండలి చైర్మన్‌కు రాజీనామా పత్రం సమర్పించాలి” అని స్పష్టం చేశారు.
మిర్జా రహ్మత్ బేగ్ 2023లో హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు పార్టీ సభ్యత్వం రద్దయినందున ఆయన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని పార్టీ ఆదేశించింది.
ఈ నిర్ణయానికి అధికారిక కారణం ఎంఐఎం ఇంకా వెల్లడించలేదు. అయితే నాలుగు రోజుల క్రితం అత్తాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని రహ్మత్ బేగ్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలే పార్టీ చర్యకు కారణమని ఎంఐఎం అధికారికంగా నిర్ధారించలేదు.
మరోవైపు రహ్మత్ బేగ్ ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫ్ చేసిన ఫోటోలు సర్క్యులేట్ చేస్తామని బెదిరించి డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు తర్వాత కొద్ది గంటల్లోనే పార్టీ బహిష్కరణ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కొన్ని మీడియా నివేదికల్లో వీడియో లీక్ వివాదం కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు ప్రస్తావించబడింది. అయితే పార్టీ ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.
ప్రస్తుతం ఈ పరిణామం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రహ్మత్ బేగ్ రాజీనామా చేస్తారా? లేదా మరో మార్గం ఎంచుకుంటారా? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి నోట్లో ఉన్నాయి.