CM Revanth Reddy: బీసీ బిల్లుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం: ముఖ్య నేతలతో చర్చలు
ముఖ్య నేతలతో చర్చలు
CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తోంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో విజయం సాధించేందుకు ప్రభుత్వం తన సర్వశక్తులను ఉపయోగిస్తోంది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం గంటగంటకు పరిస్థితిని సమీక్షిస్తూ ముందుకు సాగుతోంది.
సీఎం నివాసంలో ప్రత్యేక సమావేశం
అక్టోబర్ 8న హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు విచారణ జరగనున్న నేపథ్యంలో, అనుసరించాల్సిన వ్యూహాలు మరియు చర్యలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్ 7న సాయంత్రం తన క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తదితరులు హాజరయ్యారు.
అక్టోబర్ 6న సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసులో ప్రభుత్వం తరఫున ప్రముఖ న్యాయవాదులు అభిషేక్ సింగ్వి మరియు సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. ఇదే క్రమంలో హైకోర్టులో కూడా అక్టోబర్ 8న వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు అభిషేక్ సింగ్విని హైకోర్టులో వాదనలు వినిపించాలని కోరారు.
సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం అభిషేక్ సింగ్విని కలిసి, హైకోర్టులో స్వయంగా హాజరై వాదనలు వినిపించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రేపు (అక్టోబర్ 8న) హైకోర్టులో ప్రభుత్వం తరఫున అభిషేక్ సింగ్వి వాదనలు వినిపించనున్నారు.