CM Revanth Reddy: విద్య, వైద్య రంగాలపై ప్రతి వారం జిల్లాల వారీగా సమీక్షించాలి: సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
కీలక ఆదేశాలు
CM Revanth Reddy: రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. శనివారం సీఎంఓ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన ఆస్పత్రుల నిర్మాణాలు, సిబ్బంది నియామకాలు, సీజనల్ వ్యాధుల నివారణ, రాబోయే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
నిర్మాణంలో ఉన్న ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్ (TIMS) ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఉస్మానియా నూతన ఆస్పత్రి నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఆస్పత్రులు పూర్తయ్యేలోపే అవసరమైన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియను ముందస్తుగా పూర్తి చేయాలని, అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు.
జిల్లాల్లో కలెక్టర్లు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో విధిగా పర్యటించాలని సీఎం తేల్చి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, ఆసుపత్రులను స్వయంగా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించాలని ఆదేశించారు. వర్షాకాలం, సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని, వైద్య శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
విద్య, వైద్య రంగాలతో పాటు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. డిసెంబర్‌లో ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యం, మౌలిక వసతులు, అంతర్జాతీయ పెట్టుబడులే లక్ష్యంగా ఈ సమీక్ష జరిగింది.
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాల వారీగా ప్రతి వారం విద్య, వైద్య రంగాలపై సమీక్షలు నిర్వహించి పురోగతిని పర్యవేక్షించాలని అధికారులకు సూచనలు చేశారు.