Medaram Maha Jatara–2026 Poster: సీఎం రేవంత్ రెడ్డి మేడారం మహా జాతర-2026 పోస్టర్ ఆవిష్కరణ
మేడారం మహా జాతర-2026 పోస్టర్ ఆవిష్కరణ
Medaram Maha Jatara–2026 Poster: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మేడారం మహా జాతర-2026 పోస్టర్‌ను ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డికి సమ్మక్క తల్లి కంకణం కట్టి, బొట్టు పెట్టారు. ఈ సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
మేడారం మహా జాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. మొదటి రోజు అయిన జనవరి 28 బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారం గద్దెలపై చేరుకుంటారు. 29వ తేదీన చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. 30వ తేదీన భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. చివరి రోజు అయిన 31వ తేదీ సాయంత్రం 6 గంటలకు అమ్మవార్లను వనప్రవేశం చేసి జాతరను ముగించనున్నారు.
ఈ మహా జాతర సందర్భంగా భక్తుల సౌకర్యం కోసం ఆర్టీసీ 3,495 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. మేడారంలో 28 ఎకరాల విస్తీర్ణంలో బస్టాండ్, క్యూలైన్లు, భక్తుల విశ్రాంతి గదుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.
తెలంగాణ గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ మహా జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.