Coconut Water Truck: కొబ్బరి బొండాల లారీ బోల్తా... అందినకాడికి దోచుకున్న జనం...

అందినకాడికి దోచుకున్న జనం...

Update: 2025-09-22 10:22 GMT

Coconut Water Truck: ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఆదుకోవాల్సింది పోయి,.. అందిన కాడికి దోచుకునే పనిలో పడ్డారు కొందరు ప్రజలు. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన మానవత్వం మంట కలిసింది అనే వ్యాఖ్యానికి నిదర్శనంగా నిలిచింది. సూర్యాపేట మండలం రాయన్నగూడ వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. కొబ్బరి బొండాలతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో.. అందులోని డ్రైవర్ కు సహాయం చేయాల్సింది పోయి..వాటిని దోచుకునే పనిలో పడ్డారు స్థానికులు.

నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు కొబ్బరి బొండాల లోడుతో బయలుదేరిన లారీ, సూర్యాపేట సమీపంలోని జాతీయ రహదారిపైకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. లారీలోని కొబ్బరి బొండాలు రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకొని...రోడ్డుపై పడిన కొబ్బరి బొండాలను ఏరుకోవడానికి ఎగబడ్డారు. చేతికి అందిన వాటిని అందినట్టుగా సంచుల్లో, బస్తాల్లో నింపుకొని ఇళ్లకు తరలించారు. అటుగా కార్లలో వెళ్తున్న కొందరు ప్రయాణికులు కూడా వాహనాలు ఆపి మరీ కొబ్బరి బొండాలను ఎత్తుకెళ్లడం ఆశ్చర్యపరిచింది.

ఈ ఘటనతో తనకు సుమారు రూ. 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని లారీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో లారీని పక్కకు తొలగించారు. ఆ తర్వాత రోడ్డుపై ట్రాఫిక్‌ను పునరుద్ధరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Tags:    

Similar News