Commissioners :ప్రతి రోజూ ఇంటింటా చెత్త సేకరణ చేపడతాం

చెత్త సేకరణ చేపడతాం

Update: 2026-02-21 14:07 GMT

Commissioners : స్వచ్ఛ ఆటోల నిర్వాహకులు కమిషనర్లకు హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ నగరంలో ప్రతి ఇంటి నుంచి రోజువారీ చెత్త సేకరణను నిర్వహిస్తామని వారు హామీ ఇచ్చారు. ఇంటింటా చెత్త సేకరణలో లోపాలు ఉండటం వల్లే రోడ్లు, ఖాళీ స్థలాల్లో చెత్తకుప్పలు పెరిగిపోతున్నాయని కమిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు ఆర్‌వీ.కర్ణన్‌, సృజన, వినయ్‌కృష్ణారెడ్డి శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. సమావేశంలో స్వచ్ఛతపై చర్చ జరిగింది.

అంతకుముందు, ఇంటింటా చెత్త సేకరణను ప్రైవేటుపరం చేస్తే తమ ఉపాధి కోల్పోతామని, వేలాది కుటుంబాలు నిరాశ్రయులవుతాయని స్వచ్ఛ ఆటో కార్మికులు జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. కమిషనర్లు వెంటనే స్పందించి, వారితో మాట్లాడారు. ప్రైవేటుపరం చేసే ఉద్దేశం ఏమీ లేదని, అయితే వారి పనితీరుపై అసంతృప్తి ఉందని స్పష్టం చేశారు. దీంతో, ఇకపై 100 శాతం చెత్త సేకరణ చేస్తామని కార్మిక సంఘాల నాయకులు కమిషనర్లకు హామీ ఇచ్చారు.

కమిషనర్ల సూచనలు

నగర శుభ్రతను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఈ సూచనలు అమలు చేయాలంటే అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, చెత్త సేకరణ ఆటోలు పూర్తి స్థాయిలో పని చేయాలి. రోడ్ల పక్కన చెత్తకుప్పలు కనిపించకూడదు. త్వరలో 100 రోజుల పారిశుద్ధ్య కార్యాచరణ ప్రణాళికలో పాల్గొనాలి. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని, ప్రమాదాలు జరిగితే పరిహారం అందిస్తామని కమిషనర్లు తెలిపారు. అదనపు కమిషనర్లు రఘుప్రసాద్‌, రవికిరణ్‌, యాదగిరిరావు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News