Cabinet Sub-Committee : ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు పూర్తి చేయండి
ఇన్ఫ్రా స్ట్రక్చర్ మరియు క్యాపిటల్ వర్క్స్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు;
రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందేందుకు పెట్టుబడులు కీలకమని జాగ్రత్తగా వనరులను వినియోగించుకుంటూ ప్రాధాన్యత క్రమంలో వివిధ శాఖల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం, సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రులు, క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క లతో కలిసి డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీయం మాట్లాడుతూ రాబడికి, బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా 1:3 వంతుల పద్ధతిన పనుల కేటాయింపు అనేది కొన్ని దశాబ్దాలుగా పాలనలో పాటిస్తున్న విధానమని డిప్యూటీ సీఎం తెలిపారు. అయితే గత పది సంవత్సరాలు పరిపాలించిన వారు ఆదాయంతో, బడ్జెట్ కేటాయింపులతో సంబంధం లేకుండా కొన్ని శాఖల్లో 1:25 వంతున అభివృద్ధి పనులకు అనుమతులు ఇచ్చారు. వాటిని ప్రారంభించి వెళ్లిపోయారు. ఫలితంగా నిధుల కొరతతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి, కొత్తగా వచ్చిన మంత్రులు వారి శాఖలో పనులు ప్రతిపాదించే పరిస్థితి లేకుండా పోయిందని డిప్యూటీ సీఎం అధికారులకు తెలిపారు. గత ప్రభుత్వ పెద్దల నిర్ణయాల మూలంగా ప్రస్తుతం ఏ పని పూర్తయ్యే పరిస్థితి లేదు, ఏ పనికి నిధులు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని డిప్యూటీ సీఎం అధికారులకు వివరించారు. వివిధ శాఖల్లో నెలకొన్న ఆందోళనకర, అనారోగ్యకర పరిస్థితులను వివిధ శాఖల కార్యదర్శులు సరిచేయాలని డిప్యూటీ సీఎం ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించారు.
మొదటగా 95% పూర్తయిన పనులను గుర్తించండి.. ఈ తరహాలోనే పనుల ప్రాధాన్యతను గుర్తిస్తూ, ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు పోవాలని డిప్యూటీ సీఎం అధికారులకు తెలిపారు. వివిధ శాఖల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టే క్రమంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, నాబార్డ్ సహకారంతో చేపట్టిన పనులను ప్రాధాన్యతగా భావించి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని శాఖలకు నూరు శాతం ప్రాధాన్యత ఇచ్చి మరి కొన్ని శాఖలకు 10 శాతం మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు, ఆ తరహా పరిస్థితి ఇప్పుడు ఏర్పడకూడదని మంత్రులు అధికారులకు సూచించారు. ఒకవైపు అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేస్తూనే మరోవైపు ఆదాయాలు పెంచుకునే విధంగా అందరూ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని మంత్రులు సూచించారు. సబ్ కమిటీ సమావేశానికి వచ్చేముందు ఆయా శాఖల ఉన్నతాధికారులు సంబంధిత మంత్రులతో అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రాధాన్యత జాబితాలను సిద్ధం చేసుకుని రావాలని మంత్రులు సూచించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రానా, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ టి కే శ్రీదేవి, గృహ నిర్మాణ శాఖ ఎండి గౌతం, హోం శాఖ సెక్రెటరీ రవి గుప్తా, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.