Minister Seethakka: వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని, ఇంకుడు గుంతలు, మ్యాజిక్‌ పిట్ల నిర్మాణాలు రెండు రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో, నీటి పొదుపుపై గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు.


గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజినీర్లతో శనివారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన మంత్రి సీతక్క, ఎల్‌నినో నేపథ్యంలో సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి అవసరాలకు రూ.120 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించామని, ఇతర జిల్లాల్లో తక్షణ తాగునీటి అవసరాలకు రూ.కోటి చొప్పున నిధులు వెచ్చించామని వివరించారు.


తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, నీటి ఎద్దటి ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరాకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. చేతిపంపులు, బావులు, స్థానిక నీటి వనరులను అందుబాటులో ఉంచాలని, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

Tags: