Revanth Reddy: గత సీఎంలు ప్రవేశపెట్టిన పథకాలు, ప్రాజెక్టులను కొనసాగిస్తూనే వాటికి అదనంగా కొత్తవి అమలు చేస్తున్న ఘనత తనకే దక్కుతుందని ముఖ్యమంత్రి ఎన్. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రతి పథకాన్ని గతంలోకంటే నాణ్యంగా, అవినీతి రహితంగా కొనసాగిస్తున్నామని ఆయన అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం దిల్లీలోని తన నివాసంలో సుమారు రెండు గంటలపాటు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.

గతంలో సీఎంలుగా పనిచేసిన ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు, వైఎస్. రాజశేఖరరెడ్డి, కేసీఆర్‌లు ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తూనే కొత్తవి అదనంగా అమలు చేస్తున్నానని రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘‘ఎన్టీఆర్ రూ.2కి బియ్యం ఇస్తే మేం సన్నబియ్యం ఇస్తున్నాం. చంద్రబాబు చేసిన అభివృద్ధికంటే పెద్దపనులు చేస్తున్నాం. రాజశేఖరరెడ్డి తెచ్చిన ఉచిత కరెంటును కొనసాగిస్తూనే 50 లక్షల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తున్నాం. కేసీఆర్ రైతుభరోసా కింద రూ.10వేలు ఇస్తే మేం రూ.12వేలకు పెంచాం. కేసీఆర్ చేసిన స్కాంలు తప్పితే ఇంకే పథకాలూ ఆపలేదు’’ అని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు నెలవారీ జీతాలు, పింఛన్లు ఒకటో తేదీనే అందుతున్నాయని, రూ.20,600 కోట్ల రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం (ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్లు), 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో 2.20 లక్షలు పూర్తి చేశామని వివరించారు. 75 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర గత ప్రభుత్వాలకు లేదని, విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచామని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, కులగణన చేపట్టిన ఘనత తనదేనని చెప్పారు.

జలవనరుల పరంగా రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరిగి ఉంటే 1995 నుంచి దాదాపు 30 ఏళ్లపాటు వివిధ హోదాల్లో అధికారంలో ఉన్న కేసీఆర్‌దే బాధ్యతని ఆరోపించారు. తొలిసారి సీఎం అయిన తనకు అధికార అనుభవం లేకపోయినా అపరిపక్వతతో నిర్ణయాలు తీసుకోవడం లేదని, రాజకీయ భేషజాలు లేవని స్పష్టం చేశారు. కాళేశ్వరం పునరుద్ధరణపై ఎన్‌డీఎస్‌ఏ మార్గదర్శనం ప్రకారమే ముందుకెళ్తామని, ప్రజాప్రయోజనాలనే చూస్తున్నామని, ప్రజాధనాన్ని సద్వినియోగంలోకి తేవాలన్నదే లక్ష్యమని అన్నారు. కృష్ణాలో 500 టీఎంసీలు, గోదావరిలో 1,000 టీఎంసీలు వాడుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఎన్‌ఓసీ ఇస్తే గోదావరి-కావేరి అనుసంధానానికి అభ్యంతరం లేదని వెల్లడించారు.

కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసింది కేసీఆర్‌నేనని, 299 టీఎంసీలు చాలని సంతకం చేసింది ఆయనేనని, కల్వకుర్తి, డిండి, పాలమూరు, ఎస్‌ఎల్‌బీసీల్లో ఒక్కటీ పూర్తి చేయలేదని ఆరోపించారు. పోలవరం-బనకచర్ల ఆలోచన కేసీఆర్‌దేనని, అసెంబ్లీలో ఆయన చేసిన ప్రసంగం వినాలని సవాలు విసిరారు. గోదావరి-కావేరి అనుసంధానం కావాలంటే పాలమూరు, డిండిలకు ఎన్‌ఓసీ ఇవ్వాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నానని, ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే 145 టీఎంసీల్లో 43 టీఎంసీలు ఇచ్చి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నానని చెప్పారు.

హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం ఆమోదం, ఐఆర్‌ఎఫ్‌సీ రుణం రాకుండా కేటీఆర్, కిషన్‌రెడ్డిలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రం ఏ ప్రతిపాదన చేస్తే దాని ప్రకారం ముందుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని, ఎల్‌అండ్‌టీ ప్రాజెక్టును టేకోవర్ చేసి 3.5% వడ్డీకి రుణం తీసుకోవాలని నిర్ణయించామని, అయినా అనుమతులు రాకపోవడం వెనుక రాజకీయ కారణాలేనని అన్నారు. ప్రస్తుత మెట్రో ఏటా రూ.600 కోట్ల నష్టంలో నడుస్తోందని, యథాతథంగా ఇచ్చేస్తే రూ.15 వేల కోట్లకు తీసుకున్నామని వివరించారు.

ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మును శాశ్వత ఆస్తులు కల్పించడానికే వాడుతున్నామని, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు రాష్ట్ర ఖజానా సొమ్ము వాడుతున్నామని చెప్పారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల బదులు వన్‌వే చేయడం వల్ల రూ.2,600 కోట్లు ఆదా అవుతుందని, ఆ ప్రయోగం విజయవంతమైనందున ఫ్లైఓవర్ల నిర్మాణం ఆపేశామని తెలిపారు. తుమ్మిడిహెట్టిని 152 మీటర్ల ఎత్తులో నిర్మించాలని మహారాష్ట్రతో చర్చలు సాగుతున్నాయని, తొలిదశ చర్చలు సఫలమైనట్లు భావిస్తున్నామని అన్నారు. కాళేశ్వరంలో ప్రస్తుతం నీళ్లు నిలిపే పరిస్థితి లేకపోవడంతోనే ఉపయోగించడం లేదని, రాజకీయాల కోసం కాదని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోనని, ప్రజలకు ఏదో చేయాలన్న సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని రేవంత్‌రెడ్డి చెప్పారు.

Tags: