నేనూ కులవివక్ష ఎదుర్కొన్నాను... బలమైన సంకల్పంతో ముందుకు సాగాలి


Deputy CM Bhatti Vikramarka: కులవివక్ష భారత సమాజంలో ఒక వాస్తవమని, తాను కూడా దానిని ఎదుర్కొన్నానని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అయితే, ఈ వాస్తవాన్ని గుర్తుంచుకుని బలమైన సంకల్పంతో లక్ష్యసాధన కోసం ముందుకు సాగితే కులవివక్ష లక్ష్యాలను దెబ్బతీయలేదని ఆయన ఉద్ఘాటించారు.

వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్‌లోని హరిత రిసార్టులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో మూడో రోజు సోమవారం భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు.

ఈ సమాజంలో సామాజిక, ఆర్థిక విభజనలను కొనసాగించాలని కొన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం రాజకీయ సంస్థగా మాత్రమే కాకుండా, బాధ్యతాయుతమైన వ్యవస్థగా దశాబ్దాలుగా అంటరానితనం, బాల్య వివాహాలు, వితంతు వివాహాలు వంటి సామాజిక రుగ్మతలపై ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకు సాగుతోందని చెప్పారు.

రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశంలోని ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భట్టి అభిప్రాయపడ్డారు. భాజపా కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలని ప్రయత్నిస్తోందని, అంటరానితనం, వివక్ష ఎదురైన చోట రాహుల్ గాంధీ ప్రత్యక్షమవుతారని పేర్కొన్నారు.

ఉదాహరణగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల కులవివక్ష భరించలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటనను గుర్తుచేస్తూ, రాహుల్ గాంధీ విద్యార్థులతో చర్చించి పోరాట విధానాన్ని రూపొందించారని తెలిపారు. అంటరానితనాన్ని సమస్యగా చూడాలని, దానిలో రాజకీయ జోక్యం ఉండకూడదనే రాహుల్ ఆలోచన మేరకు కర్ణాటక, తెలంగాణలో 'రోహిత్ వేముల చట్టం' తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాహుల్ గాంధీ ఎన్నికల ముందు చేసిన ప్రకటనల మేరకు వనరులు, సంపదను ప్రజలకు సమానంగా పంచుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.

ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ, శిబిరంలో ఇవ్వబడుతున్న శిక్షణ ద్వారా పార్టీ సిద్ధాంతాలను అందరూ తెలుసుకుంటే భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగగలరని అన్నారు. ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్, శిబిరం సమన్వయకర్త సచిన్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శిబిరంలో నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలు, ఎన్నికల వ్యూహరచన, సోషల్ మీడియా నిర్వహణ, కార్యాచరణ ప్రణాళికలపై నిపుణులు శిక్షణ అందిస్తున్నారు.

Tags: